ఎర్ర కాళ్ల కొంగలు కనువిందు
పెద్దదోర్నాల: మండల కేంద్రంలో ఎర్ర కాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టార్క్) కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ కొంగలు సంచరిస్తుండటంతో మండల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మండల కేంద్రంలోని నేషనల్ హైవే బైపాస్ రోడ్డులో కొద్దిరోజుల నుంచి ఎర్ర కాళ్ల కొంగలు సంచరిస్తున్నాయి. ఇవి దక్షిణాసియాతో పాటు సైబీరియా దేశాలలో సంచరిస్తుంటాయని, శీతాకాలంలో వలస వస్తుంటాయని ప్రముఖ వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ మహమ్మద్ హయాత్ తెలిపారు. ఇవి ఎక్కవగా నీటి వనరులు, పచ్చిక బయళ్లు ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని, వీటి ముక్కు పొడవుగా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వెడల్పాటి రెక్కలతో చూసేందుకు అందంగా ఉంటాయని ఆయన తెలిపారు.
● నేడు పేరెంట్స్–టీచర్స్ సమావేశాలపై విమర్శలు
ఒంగోలు సిటీ: పేరెంట్స్–టీచర్స్ సమావేశాల పేరుతో హడావిడి తప్ప ఏమీ ఉపయోగం లేదనే విమర్శలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. శుక్రవారం ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాకపోవడంతో హెచ్‌ఎంలు తమ జేబులకు చిల్లు తప్పదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం వదిలేసింది. నాణ్యమైన మెనూకు మంగళం పాడింది. ఇటువంటి సమస్యల మధ్య విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు పరీక్షల సీజన్‌లో విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంది. ఈ సమయంలో అవసరమైన చర్యలు చేపట్టకుండా మొక్కుబడి సమావేశాలు అవసరమా అంటూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఒంగోలు సబర్బన్: డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండటం వలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్థానిక పాత జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు డివిజిన్ డెవలప్మెంట్ అధికారి, డివిజినల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీపీఓ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్, జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈవో జాలమ్మ, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డీఎల్‌డీవో సువార్త, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


