గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలి
పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీపడేందుకు కృషి చేయాలి జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: జిల్లాలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలని, గంజాయి విక్రేతలు, వినియోగదారులపై నిఘా పెట్టి కట్టడి చేయాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా పలువురు డీఎస్పీలతో కలిసి ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా చేసే వారిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. లోకల్ పెడ్లర్స్‌తోపాటు రిసీవర్లను గుర్తించాలని, పెడ్లర్స్‌తో సంబంధాలున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సేవించేవారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి కేసుల్లో నిందితులపై అధికారులతో చర్చించి పీడీ చట్టం ప్రయోగించడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రౌడీషీటర్ల దైనందిన జీవన విధానాన్ని, వారి వ్యక్తిగత ప్రవర్తనను గమనించాలన్నారు. పదే పదే నేరాలకు పాల్పడడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని పొగమంచు ఏర్పడే సమయాలలో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వాహనచోదకులు ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. పోక్సో, మహిళలపై నేరాల కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే విచారణ వేగవంతం చేయాలని, నిర్ణీత సమయంలో చార్జిషీట్ ఫైల్ చేసేందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో జరగబోవు లోక్ అదాలత్‌లో అత్యధికంగా కేసులు రాజీపడేలా చూడాలన్నారు. సమీక్షలో ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, డీసీఆర్‌బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, పీసీఆర్ సీఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


