మార్కాపురం ప్రజల ఆనందం ఆవిరి..!
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మార్కాపురం నుంచి నంద్యాల, గుంటూరుకు బదిలీ 20,351 మంది వాహనదారులకు కష్టాలు మార్కాపురం జిల్లా వచ్చిందన్న ఆనందం లేకుండా పోతోందంటున్న ప్రజలు
మార్కాపురం:
మార్కాపురం జిల్లా వచ్చిందన్న ఆనందం ఆవిరైపోతోందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, మరోవైపు ఆర్టీఓ కార్యాలయం జారీచేసే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేసే అధికారాన్ని నంద్యాలకు బదిలీ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వాహనదారులకు శాపంగా మారిందంటున్నారు. మార్కాపురం రవాణాశాఖ అధికారి పరిధిలోని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి నంద్యాల, గుంటూరు ఆర్టీఓ పరిధిలోకి మారుస్తూ తీసుకున్న నిర్ణయం వాహనదారులకు భారంగా మారింది. మార్కాపురం రవాణాశాఖ కార్యాలయ పరిధిలో మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం అన్ని రకాల వాహనాలు కలిపి 20,351 ఉన్నాయి. వీరంతా ఇప్పటివరకూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మార్కాపురంలోనే తీసుకుంటున్నారు. ఈ నెల 1 నుంచి ఈ సర్టిఫికెట్ల జారీని నంద్యాల, గుంటూరుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
సుమారు రూ.20 వేల అదనపు భారంతో ఆందోళన...
మార్కాపురం ప్రాంత లారీల యజమానులు ఇప్పటి వరకూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు కేవలం ప్రభుత్వ చలానా చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు నంద్యాల లేదా గుంటూరు వెళ్లాలంటే సుమారు 20 నుంచి 22 వేల రూపాయలు అదనంగా చలానా భారం పడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం మార్కాపురంలో పలువురు ఆటో డ్రైవర్లు, మోటారు వర్కర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటోలు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు, ప్రైవేటు బస్సులకు ప్రభుత్వ నిర్ణయం భారం కానుందని వాపోయారు. మార్కాపురం ఆర్టీఓ పరిధిలో ఎల్‌జీవీ పెద్దవి 711, చిన్నవి 2050, ట్రాక్టర్లు 404, క్యాబ్‌లు 1785, స్కూల్ బస్సులు 296, కార్లు 6051, ఆటోలు 2679, ట్రాక్టర్ ట్రైలర్లు 1304, వ్యవసాయ ట్రాక్టర్లు 6282 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా 20,351 వాహనాలు ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరంతా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఇకపై గుంటూరు లేదా నంద్యాల వెళ్లాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలి
ఇప్పటివరకూ మార్కాపురం ఆర్టీఓ పరిధిలో ఇస్తున్న ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను నంద్యాల లేదా గుంటూరుకు మార్చడం మంచిది కాదు. మాకెంత ఆర్థిక భారం కానుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎటుచూసినా సుమారు 200 కిలోమీటర్లు వెళ్లి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకుని యథావిధిగా మార్కాపురంలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.
– శ్రీనివాసులు, ఆటో డ్రైవర్, మార్కాపురం
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
మార్కాపురం పట్టణంలో ఆర్టీఓ కార్యాలయం ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని నంద్యాల లేదా గుంటూరు పరిధిలోకి ప్రభుత్వం మార్చడం సరికాదు. డ్రైవర్లకు చాలా ఇబ్బంది కలిగించే అంశం. అదనంగా ఆర్థిక భారం పడుతోంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. లేదంటే ఆటో కార్మికుల కోసం ఉద్యమం చేపడతాం.
– ఎస్‌కే ఖాశీం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి
మార్కాపురం ప్రజల ఆనందం ఆవిరి..!
మార్కాపురం ప్రజల ఆనందం ఆవిరి..!


