సాగని ఆశలు !
జిల్లాలో సాగునీటి రంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం కీలకమైన వెలిగొండకు అత్తెసర నిధులు కావాల్సింది కొండంత.. విదిల్చింది గోరంత బడ్జెట్‌లో వెలిగొండకు రూ.110 కోట్లు మాత్రమే కేటాయింపు సాగునీటి చెరువుల మరమ్మతులు గాలికొదిలేసిన వైనం సాగర్ కాలువల ఆధునికీకరణ పట్టని సర్కార్ జిల్లాలో చెరువులు, కాలువల అభివృద్ధి ప్రతిపాదనలు వెనక్కి మండిపడుతున్న రైతు సంఘాలు
అత్తెసరు నిధులు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశంతో పాటు వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు జీవనాధారమైన వెలిగొండ ప్రాజెక్టును టీడీపీ కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీళ్లివ్వాలంటే వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వేళ్లతో విదిల్చినట్లుగా ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.110 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో ఏడాది పూర్తి కావస్తున్నా వెలిగొండ పూర్తి చేయడంలో మాత్రం సీఎం చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.477 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి రూ.8,650 కోట్ల నిధులు మంజూరు చేశారు. శరవేగంగా పనులు సాగాయి. ఆయన అకాల మరణంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. 2014 నుంచి 2019 చంద్రబాబు పాలనలో వెలిగొండ దాదాపుగా మూలనపడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మరోవైపు నిర్వాసితులకు అండగా నిలిచారు. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంట వద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద కలనూతలలో, కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాలు, పాఠశాలలను నిర్మించారు. చంద్రబాబు హయాంలో పునరావాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రూ.12.50 లక్షలకు పెంచారు. అందుకోసం రూ.1400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పట్టించుకోకపోవడంతో చిల్లచెట్లు, పిచ్చికలపతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. దీంతో నిర్వాసితుల్లో ఒకరకమైన నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి.
153 వర్కులకు
రూ.13.20 కోట్లతో ప్రతిపాదనలు వెనక్కి...
జిల్లాలోని సాగునీటి చెరువులు, కాలువల అభివృద్ధి కోసం జిల్లా జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి గత సంవత్సరం ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో ప్రధానంగా సమస్యలున్న 153 పనులను గుర్తించిన అధికారులు అందుకోసం సుమారు రూ.13.20 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. వాటిని ప్రభుత్వం వెనక్కి పంపింది. అందులో ప్రధానంగా కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలేరు–బిట్రగుంట సప్లయ్ చానల్ కింద 11 అభివృద్ధి పనులకు రూ.1.47 కోట్లు కేటాయించాలని పంపిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం ప్రాజెక్టుకు టీడీపీ పాలకులు మంగళం పాడి కనీసం ఉపయోగంలో లేకుండా చేశారు. కనీసం ఈ నిధులైనా వస్తే పీబీ చానల్ కింద చెరువులు బాగుపడతాయని, దానికింద ఉన్న 9 చెరువుల పరిధిలోని 9,500 ఎకరాలకుపైగా పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని రైతులు కూడా భావించారు. అయితే, దానిని సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.
సాగునీటి చెరువులు, కాలువలకు
మరమ్మతులు ఎక్కడ...
అసలే వెనుకబడిన జిల్లా. దానికితోడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచే జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. అయినా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కనీసం వ్యవసాయ రంగంపై కరుణ చూపించిన దాఖలాలు లేవు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మధ్యతరహా, చిన్నతరహా నీటి ప్రాజెక్టుల కిందే పంటలు సాగవుతున్నాయి. వాటిలో చిన్న తరహా నీటి ప్రాజెక్టుల కింద జిల్లా వ్యాప్తంగా 852 సాగునీటి చెరువులున్నాయి. వాటితో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కూడా పంటలు సాగుచేస్తున్నారు. ఇవికాకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా పంటలు సాగుచేస్తున్నారు. వీటన్నింటి కింద జిల్లా వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షలకుపైగా సాగు భూమి ఉంది. అయితే, ఇవన్నీ లెక్కల్లోనే ఉన్నాయి. వీటన్నింటికీ చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ కింద వందల, వేల కిలోమీటర్ల కొద్దీ సాగునీటి కాలువలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చెరువులు, కాలువల మరమ్మతులకు చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయలేదు. ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 6.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉండగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 లక్షల ఎకరాల్లో కూడా పూర్తి స్థాయిలో పంటలు పండలేదు.
పిచ్చిచెట్లతో నిండిన సాగునీటి కాలువలు...
సాగునీటి చెరువులు, కాలువలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. చిన్ననీటి పారుదల చెరువుల నుంచి పంటలకు నీరందించే కాలువలు సైతం పూడిపోయి పంట పాలాలకు సక్రమంగా నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, వర్షం పడిందంటే కాలువల్లో నీరు ఎటుపడితే అటు వెళ్లిపోవటమే తరువాయి. జిల్లాలోని చెరువుల నుంచి పొలాలకు నీటిని అందించే తూములు సైతం పూడిపోయాయి. చెరువుల్లో బెడ్‌లెవల్స్ కూడా పూడికతో నిండిపోయాయి. ఇక జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన సాగర్ కుడికాలువ పరిస్థితి మరీ దారుణం. సాగర్ ఆయకట్టు కింద దాదాపు 4 నుంచి 4.50 లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. అయితే, సాగర్ మేజర్ కాలువలు, మైనర్ కాలువలు పిచ్చి చెట్లతో, జమ్ము తూడుతో పూర్తిగా కనపడకుండా కనుమరుగైపోయే పరిస్థితి నెలకొంది. సాగర్ నీరు వచ్చినా చివరి ఆయకట్టు వరకు నీరు చేరే అవకాశం లేదు.
సాగని ఆశలు !
సాగని ఆశలు !


