ప్రైవేటీకరణను అడ్డుకుందాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒంగోలు 44, 45 డివిజన్లలో కోటి సంతకాల సేకరణ
ఒంగోలు సిటీ: కోటి సంతకాలు సేకరించి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం ఒంగోలులోని 44, 45 డివిజన్లలో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అధ్యక్షత వహించగా, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డితో కలిసి శివప్రసాద్‌రెడ్డి, రవిబాబు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టి నేటికి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం, విద్య అందించాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు వాటిని పూర్తిచేయలేక పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్య అందక ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని వివరించారు. వైఎస్సార్ సీపీ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని తమ సంతకాలతో కూటమి ప్రభుత్వ కుట్రలను బద్దలుకొట్టాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణను వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ఒక ఉద్యమంలా గ్రామగ్రామాన చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. పార్టీలు, కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను పూర్తిగా అమలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. కానీ, ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కల సాకారం చేసేలా కృషి చేసిన గొప్ప దార్శనికుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత ఒక్క మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, కేవీ రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, వైఎస్సార్ సీపీ నాయకులు నరసింహారెడ్డి, బుజ్జి, నరసింహగౌడ్, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి, నవీన్‌రెడ్డి, అప్సరా బేగం, భూమిరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న, వెన్నుపూస కుమారి, మేరీ, వాణి, మాధవి, రమణమ్మ, సంధ్యారెడ్డి, 44వ డివిజన్ నాయకుడు మాల్యాద్రిరెడ్డి, 45వ డివిజన్ నాయకుడు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, వెన్నుపూస వెంకటేశ్వరరెడ్డి, ముఖ్య నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


