ప్రకాశం జిల్లా: మండల పరిధిలోని చిలకచర్లలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటతో అదే గ్రామానికి చెందిన గిరిజన బాలుడు ఆర్తి నాగన్న(16) మృతదేహాన్ని పాతి పెట్టి ఉండటం కలకలం రేపింది. ఈ సంఘటన కొద్ది రోజుల ముందు చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్, తహసీల్దార్ అశోక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు.
అనంతరం పంచనామా అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. యువకుడి మృతదేహం మొక్కజొన్న తోటలో పూడ్చిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొద్ది రోజులుగా కనబడకుండా పోయిన తమ కుమారుడు ఇలా మొక్కజొన్న తోటలో శవమై తేలడంతో మృతుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించటం అందరినీ కలిచివేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టనున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


