రోడ్డు మార్జిన్ దిగి ఒరిగిన ప్రైవేట్ పాఠశాల బస్సు
40 మంది విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
కొండపి: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు స్కూల్ బస్సు రోడ్డు మార్జిన్ దిగి ఒక వైపునకు ఒరిగిన ఘటన ప్రకాశం జిల్లా కొండపి మండలం కొండపి–అనకర్లపూడి గ్రామాల మధ్య అట్లేరు వాగు వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..వర్షాలకు మండలంలోని అట్లేరు వాగు పొంగడంతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది వాగుకు ఇరువైపులా ముళ్లకంచె వేసి రాకపోకలు నిలిపేశారు.
శనివారం మండలంలోని అనకర్లపూడి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు 40 మంది విద్యార్థులతో కొండపి నుంచి అనకర్లపూడికి వెళ్తుండగా అట్లేరును దాటేందుకు ముళ్లకంచెను తప్పించే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ముందు భాగం టైరు రోడ్డు మార్జిన్ దిగింది. అయినా బస్సును ఆపకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వెనుక టైర్లు కూడా మార్జిన్ దిగాయి. దీంతో బస్సు ఒకవైపు ఒరిగింది. రెండో వైపు టైర్లు పైకి లేవడంతో బస్సులోని పిల్లలు, టీచర్లు కేకలు వేశారు. దీన్ని గమనించిన ఇతర వాహనదారులు..ఎమర్జెన్సీ డోర్ నుంచి పిల్లలను దించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అనంతరం క్రేన్‌తో బస్సును రోడ్డు మీదకి తీసుకొచ్చారు.


