 
															జేసీబీలో పెళ్లి కుమార్తెలను ముసి వరద నీరు దాటిస్తున్న దృశ్యం
ప్రకాశం జిల్లాలో వరదల కారణంగా ఉప్పొంగిన ముసి వాగు
జరుగుమల్లి(సింగరాయకొండ): ఓ పక్క దగ్గర పడుతున్న పెళ్లి ముహూర్తం...మరో పక్క గ్రామాన్ని చుట్టుముట్టిన వరద.. ఈ స్థితిలో వివాహాలు జరుగుతుందా లేదా.. అని రెండు కుటుంబాలు ఆందోళన చెందాయి. చివరకు అధికారులు చొరవ తీసుకుని జేసీబీలో ఇద్దరు పెళ్లి కూతుళ్లను ఊరు దాటించడంతో వివాహాలు జరిగాయి.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాదువారిపాలేనికి చెందిన అద్దంకి శ్రీనివాసులు, విజయల కుమార్తె దుర్గకు గురువారం ఉదయం 10 గంటలకు చినగంజాంలో వివాహం జరగాల్సి ఉంది. అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరుణ దంపతుల కుమార్తె అంజలి వివాహం కూడా అదే గ్రామానికి చెందిన సుధాకర్‌తో సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది.
కానీ బుధవారం సాయంత్రం నుంచి ముసి వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం నుంచి గ్రామస్తులు బయటకు అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. దీంతో రెండు కుటుంబాల వారు అధికారులకు సమస్యను వివరించారు. దీంతో అధికారులు జేసీబీల సాయంతో పెళ్లికుమార్తెలను వరద నీటిని దాటించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
