9 మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రభుత్వాస్పత్రిలో ఏడుగురు విద్యార్థులకు చికిత్స
గ్రామంలో పర్యటించిన డీఎంహెచ్‌ఓ, విద్యా శాఖ అధికారులు
కనిగిరి రూరల్: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బడుగులేరు ఎస్సీ కాలనీకి చెందిన 9 మంది విద్యార్థులు వాంతులు, విష జ్వరాలు, కామెర్లతో కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చేరటంతో ఒక్కసారిగా ఆందోళన రేగింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామంలోని జెడ్పీఉన్నత పాఠశాలలో సుమారు 220 మంది చదువుతున్నారు. వారందరికీ మోంథా తుపాను కారుణంగా సెలవులు ఇవ్వగా.. ఎస్సీ కాలనీలో నాలుగు కుటుంబాలకు చెందిన సుమారు 13 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, జ్వరాలతో అనారోగ్యం పాలయ్యారు. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు.
వీరిలో ముగ్గురు కోలుకోగా, మిగతా 9 మందికి వాంతులు తగ్గినా జ్వరం తగ్గలేదు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) సూచన మేరకు విద్యార్థుల్ని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి బుధవారం తరలించారు. వైద్య పరీక్షలు చేయగా, కామెర్లుగా నిర్ధారణ అయింది. ఒకే ఇంట్లోని బ్లెస్సీ, రేచర్ల (9, 8 తరగతులు), మరో ఇంట్లోని అజయ్ (10వ తరగతి), ఒకే ఇంట్లోని తరుణ్, జయకుమార్, రాణి (3, 8, 10 తరగతులు), ఇంకో ఇంట్లోని కొండ్రు జగన్ (4వ తరగతి) కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విక్కి (7వ తరగతి) ఒంగోలులో, షర్లీ (8వ తరగతి) చెన్నైలో చికిత్స పొందుతున్నట్టు వారి తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలలోని 9, 10 తరగతుల విద్యార్థినులు ముగ్గురు కామెర్లకు గురైనట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. డీఈఓ, డీఎంహెచ్‌ఓ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు బడుగులేరు పాఠశాలను సందర్శించారు. గ్రామంలోని మూడు బోర్ల వద్ద, గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు.
నాలుగు రోజుల క్రితం ఓ విద్యార్థి మృతి
కాగా.. బడుగులేరు ఎస్సీ కాలనీకే చెందిన 2వ తరగతి విద్యార్థి బి.భరత్ ఈ నెల 2న మృతి చెందాడు. కడుపులోని పేగుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా చనిపోయినట్టు అతని తండ్రి బలసాని రాజశేఖర్ తెలిపారు. ఇప్పుడు మరికొందరు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో విద్యాశాఖ అధికారులు వచ్చి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. రెండేళ్ల నుంచి విద్యార్థి భరత్‌కు కడుపులో నొప్పి వస్తోందని అతని తల్లిదండ్రులు చెప్పారని డీఈఓ కిరణ్‌కుమార్ వెల్లడించారు. దీనికి, తాజా ఘటనకు సంబంధం లేదన్నారు.


