డీఆర్‌సీ.. మొక్కుబడిచేసి..!
నామమాత్రంగా డీఆర్‌సీ సమావేశం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం అధ్యక్షతన తూతూమంత్రంగా నిర్వహణ తుఫాన్ నష్టాన్ని సక్రమంగా అంచనా వేయడం లేదని ధ్వజమెత్తిన వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడిన ప్రజాప్రతినిధులు
ఒంగోలు సబర్బన్: స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం మొక్కుబడిగా సాగింది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఽఅధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నామమాత్రపు చర్చలు మినహా లోతైన సమీక్ష జరగలేదు. జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు గత డీఆర్‌సీలో లేవనెత్తిన సమస్యలు ఇంత వరకూ పరిష్కారం కాలేదని ధ్వజమెత్తారు. ప్రధానంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పశ్చిమ ప్రకాశంలో ప్రధానంగా మంచినీటి సమస్య ఉందన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ కొన్ని మంచినీటి పథకాలు పనిచేయటం లేదన్నారు. మోంథా తుఫాన్ నష్టం అంచనాలను అధికారులు సక్రమంగా వేయడం లేదని మండిపడ్డారు. ప్రధానంగా మిర్చి పంట బాగా దెబ్బతిందని, కానీ, కాయ దశలో ఉంటేనే నష్టపరిహారం ఇస్తామనటం సరైన పద్ధతి కాదని అన్నారు. మిర్చి, పత్తి పంటలకు ఎక్కువ మోతాదులో నష్టం వాటిల్లిందన్నారు. మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలన్నారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూముల కేటాయింపునకు సంబంధించి ఆస్పత్రి వైద్యులు రోజుకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారని ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాలుట్ల వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిందని, ఆ రోడ్డును పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కోరారు. నియోజకవర్గ పరిధిలో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. అసలు జలజీవన్ మిషన్‌కు ఎంత నిధులు కేటాయించారు, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో నేటికీ స్పష్టంగా చెప్పకపోవడం దారుణమన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి పథకాలను సక్రమంగా పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే తాటిపర్తి ధ్వజమెత్తారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే రెవెన్యూ సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఉద్యానవనశాఖ, మైక్రో ఇరిగేషన్, పశుసంవర్థకశాఖ, మార్కెటింగ్, అటవీ శాఖ, జాతీయ రహదారులు, తదితర అంశాలపై సమీక్షించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ పీ రాజాబాబు, జేసీ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్‌ఓ ఓబులేసు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
డీఆర్‌సీ.. మొక్కుబడిచేసి..!


