అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి!

Nov 8 2025 8:00 AM | Updated on Nov 8 2025 8:00 AM

అభివృ

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి!

నాయకుల సేవలో పారిశుధ్య కార్మికులు

అవసరం లేని చోట రోడ్లు

గిద్దలూరు రూరల్‌:

గిద్దలూరు మున్సిపాలిటీలో అవినీతి పెచ్చరిల్లుతోంది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను పప్పుబెల్లాల్లా మింగేందుకు పక్కాగా స్కెచ్‌ వేసుకున్న కూటమి నాయకులు మున్సిపల్‌ అధికారులతో కుమ్మకై ్క అడ్డగోలుగా పనులు చేస్తుండటంపై ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. శానిటేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, అడ్మినిష్ట్రేషన్‌ విభాగాల పనిచేసే అధికార యంత్రాంగం ప్రజా సమస్యలను పక్కనబెట్టి చేతివాటం చూపడంపైనే శ్రద్ధ వహిస్తున్నారని పురప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అడ్డగోలు వ్యవహారశైలి, మౌలిక వసతులు కల్పించడంలో అలవిమాలిన జాప్యం అధికారులపై వస్తున్న ఆరోపణలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఒక సమస్యను పరిష్కరించాలని కోరుతూ పదేపదే మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని బతిమలాడాల్సి వస్తోందని పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత డొల్ల

ఎల్‌ఆర్‌ఎస్‌ గ్రాంట్‌ కింద గిద్దలూరు మున్సిపాలిటీకి రూ.3 కోట్లు మంజూరు కాగా అందులో రూ.92 లక్షలు సీసీ రోడ్లకు, రూ.127 లక్షలు డ్రైనేజీలకు, రూ.74 లక్షలను డీప్‌ బోర్లు, పైపులైన్‌ నిర్మాణాలకు, రూ.7 లక్షల నిధులను వీధిలైట్లు, విద్యుత్‌ పరికరాలకు కేటాయించారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించి ప్రజోపయోగ పనులు చేపట్టాల్సిన పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పట్టణంలోని కొంగలవీడు రోడ్డు విద్యానగర్‌లో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతను గాలికొదిలేశారు. సీసీ రోడ్డు వేసి మూడు రోజులైనా క్యూరింగ్‌ చేసేందుకు చుక్క నీరు పోయలేదు. కొంగలవీడు రోడ్డులో బ్రహ్మంగారి గుడి వరకు రూ.18 లక్షలతో నిర్మించ తలపెట్టిన డ్రైనేజీ పనులను అక్టోబర్‌ 5వ తేదీన ప్రారంభించి అలాగే వదిలేశారు. వాటాల విషయం తేలకపోవడం వల్లే పనులు నిలిపేసినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. శ్రీరామ్‌నగర్‌లో మున్సిపల్‌ శాఖ అనుమతి లేకుండా నిర్మించిన నివాసాల మధ్యలో కొండ ప్రాతంలో కేవలం ఇద్దరి కోసం సీసీ రోడ్డు నిర్మించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.

కళ్లు మూసుకుంటాం కట్టుకోండి!

గిద్దలూరు పట్టణ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. టీడీపీ సానుభూతిపరుల నివాసాలు, వాణిజ్య సముదాయాలకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆగమేఘాలపై అనుమతులిస్తూ.. మిగిలిన వారిని మాత్రం నిబంధనల పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థలం వాస్తవ హద్దుల ప్రకారం కాకుండా అధిక కొలతల ప్రకారం నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చోద్యం చూడటం విమర్శలకు తావిస్తోంది. క్లబ్‌ రోడ్డులోని యూనియన్‌ బ్యాంక్‌ రోడ్డులో ఓ వ్యక్తి గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిబంధనల ప్రకారం కట్టుకుని, ఆపైన మూడు అంతస్తులు రోడ్డు మీదకు వచ్చేలా నిర్మాణం చేపట్టాడు. మెయిన్‌ రోడ్డు, గణేష్‌నగర్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, పాతపోస్టాఫీస్‌ రోడ్డులో అనుమతులు ఒక రకంగా తీసుకుని అందుకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆయా రోడ్లలో ప్రజలు ట్రాఫిక్‌ సమస్యతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు తమ సమస్యలపై చేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. విద్యుత్‌, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, డ్రెయినేజీలు తదితర సమస్యలపై ఎన్ని పర్యాయాలు అర్జీలిచ్చినా ఫలితం లేకుండా పోతోందని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజానగర్‌లో ఓ గృహ యజమాని వీధి లైటు ఏర్పాటు చేయాలని పదేపదే కోరుతున్నా సంబంధిత అధికారులు పెడచెవిన పెట్టడం పురపాలన తీరుకు అద్దం పడుతోంది.

మున్సిపాలిటీలోని శానిటేషన్‌ విభాగంలో పనిచేసే పారిశుధ్య కార్మికులను నాయకులు తమ సొంత పనులకు వినియోగించుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలో పెంపుడు కుక్కల సంరక్షణ బాధ్యతలను పారిశుధ్య కార్మికులకు అప్పగించడం గిద్దలూరులో హాట్‌ టాపిక్‌గా మారింది. శానిటేషన్‌ పనులకు వినియోగించే సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌, ఇతర వస్తువుల కొనుగోలులో గుట్టుచప్పుడు కాకుండా నిధులు నొక్కేసినట్లు ఆరోపణలున్నాయి.

రోడ్లపైనే బోర్లు.. పైపు లైన్లు

పట్టణంలోని క్లబ్‌రోడ్డు, నల్లబండబజారు, సుంకమ్మ బజారు నుంచి డీఆర్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే రోడ్డు మధ్యలో డీప్‌బోర్లు వేశారు. పైపు లైన్లు రోడ్డు మీదుగా లాగేసి వదిలేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇంటి ముందు బైకులు, కార్లు పార్కింగ్‌ చేసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తి పన్ను వసూలులో గోల్‌మాల్‌

మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో గృహాలు, వ్యాపార సముదాయాల ఆస్తి పన్ను వసూలులో రెవెన్యూ విభాగం అధికారులు గోల్‌మాల్‌కు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్‌ భవనాలకు సైతం సాధారణ పన్ను విధించడమే అందుకు కారణం. రాత్రి వేళ సైతం మున్సిపల్‌ కార్యాలయంలో ఉండి ప్రాపర్టీ ట్యాక్స్‌ల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారని స్థానికంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.

మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య స్వగ్రామం పాములపల్లె రోడ్డు అధ్వానంగా ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. ఇలా అవసరమైన చోట కాకుండా అనవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఇష్టానుసారంగా నిర్మించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజానగర్‌ పుట్టరోడ్డు మీదుగా కొంగలవీడు, ఎన్‌.బయనపల్లె గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇదే రోడ్డులో 380 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈ కాలనీకి పేరు మార్చడంపై చూపిన శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం చూపలేదు. గోతులతో బురదమయంగా మారిన రహదారిని అలాగే వదిలేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో, అర్బన్‌ కాలనీ ప్రాంతంలో సీసీ రోడ్లు నిర్మించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నా కనీస స్పందన కరువైంది.

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి! 1
1/4

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి!

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి! 2
2/4

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి!

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి! 3
3/4

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి!

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి! 4
4/4

అభివృద్ధి నాస్తి.. అవినీతి జాస్తి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement