బడా బాబులకు దేశ సంపద
దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
ఒంగోలు టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను సంపన్న వర్గాలకు దోచిపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో శుక్రవారం సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేవీ కృష్ణగౌడ్ అధ్యక్షత వహించగా, ఈశ్వరయ్య మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ప్రజలు కష్టించి సృష్టించుకున్న సంపద, పరిశ్రమలను కొద్దిమంది చేతుల్లో బీజేపీ ప్రభుత్వం పెడుతోందని విమర్శించారు. దేశంలో పేదలు మరింత పేదలుగా మారారని, కొంతమంది సంపద మాత్రమే లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోయిందని అన్నారు. ఈ అంతరాలను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని ఆధిపత్య కులాల చేతుల్లోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని, అధిక జనాభా, ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కులాలు, వర్గాల ప్రజలు నేటికీ బానిసలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రానికి ముందు ఒకసారి కులగణన జరిగిందని, 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తిరిగి కులగణన చేయకుండా పాలకవర్గాలు కుట్రపూరితంతా వ్యవహరిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ఆదర్శంగా తీసుకుని కులగణన జరిపించాలని డిమాండ్ చేశారు. కుల జనాభా ప్రతిపాదికన చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ సంపదలోనే కాకుండా చట్టసభల్లో కూడా అన్ని వర్గాలకు తగిన వాటా ఇవ్వాలంటూ ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ధర్నాలు, సదస్సులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి వెంకటరావు, నాయకులు సయ్యద్ యాసిన్, నల్లూరి మురళి, రవీంద్రబాబు, ఎం.విజయ, శ్రీరాం శ్రీనివాసరావు, హనుమారెడ్డి, ఖాశీం, రామయ్య, ప్రభాకర్, మౌలాలి పాల్గొన్నారు.


