విద్యార్థులు అస్వస్థతకు గురైన బడుగులేరు గ్రామాన్ని సందర్శించిన వైద్యారోగ్యశాఖ జేడీ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా గ్రామంలో ఇంటింటి సర్వే
కనిగిరి రూరల్: మండలంలో 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన బడుగులేరు గ్రామానికి అధికారులు క్యూ కట్టారు. గ్రామంలోని ఎస్సీకాలనీ విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సాక్షి దినపత్రికలో ‘బడుగులేరులో భయం.. భయం’ అనే శీర్షికతో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం గ్రామానికి చేరుకుంది. ఆర్‌డబ్ల్యూఎస్, హెల్త్, సచివాలయ (పంచాయతీరాజ్), విద్యాశాఖల అధికారులు గ్రామంలో తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. బడుగులేరు ఎస్సీకాలనీలో ఇప్పటికే డీప్‌బోర్‌వెల్‌ను సీజ్ చేసిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్ల ద్వారా గురువారం సురక్షిత నీరు సరఫరా చేయలేదు. దీని గురించి కూడా సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనంలో ప్రస్తావించడంతో శుక్రవారం వాటర్ ట్యాంకర్ ద్వారా సురక్షిత నీటిని ఎస్సీకాలనీవాసులకు సరఫరా చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సురక్షిత జలాలను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని ఏఈ శ్రీకాంత్ తెలిపారు. గ్రామంలో ప్రజలు వినియోగించే అన్ని డీప్‌బోర్‌వెల్స్ నీటి శాంపిల్స్ సేకరించినట్లు చెప్పారు. రెండ్రోజుల్లో ఫలితాలు వస్తాయని, వాటి ఆధారంగా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
గ్రామంలో వైద్య శిబిరం...
బడుగులేరు గ్రామాన్ని విజయవాడ నుంచి వచ్చిన వైద్యశాఖ (అంటువ్యాధుల విభాగం) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బీ మల్లీశ్వరి సందర్శించారు. బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యాశాఖ అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని ఎస్సీకాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ ఫిరోజ్, స్వరూప పాల్గొని వైద్య సేవలు అందించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించారు. విషజ్వరాలు, కామెర్లకు గురైన విద్యార్థులకు స్టూల్ పరీక్షల నిమిత్తం శ్యాంపిల్స్ సేకరించి ఒంగోలు పంపినట్లు తెలిపారు.
కదిలిన అధికార యంత్రాంగం
కదిలిన అధికార యంత్రాంగం
కదిలిన అధికార యంత్రాంగం


