సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
ఉదయం గం.11.50 నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు జనసేన పార్టీకి చెందిన కాంప్లెక్స్‌లోని జెరాక్స్ సెంటర్‌లో రూ.30 వేలు స్వాధీనం కార్యాలయంలోని సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న వైనం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో పాటు ఆన్‌లైన్ లావాదేవీలపై దృష్టి ఆకస్మిక తనిఖీలతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రం ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11.50 గంటలకు కార్యాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణాన్ని, కార్యాలయానికి ఇరువైపులా ఉన్న డాక్యుమెంట్ రైటర్ల రెండు కాంప్లెక్సులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏసీబీ సీఐలు జీ.రమేష్ బాబు, సీహెచ్.శేషుల ఆధ్వర్యంలోని అధికారులు సిబ్బందిని, డాక్యుమెంట్ రైటర్లను, కార్యాలయానికి పనిమీద వచ్చిన వారిని కూడా ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులు చేయడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు ఉలిక్కిపడ్డారు. వ్యక్తిగత పనిమీద జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ జాయింట్–1, జాయింట్–2 ఉన్నారు. వాళ్లిద్దరినీ కదలనీయకుండా ఒక ఏసీబీ అధికారి ఎదురుగా కూర్చున్నారు. అధికారులు ఆకస్మికంగా దాడులు చేస్తుండడంతో కొప్పోలుకు చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ తన వద్ద ఉన్న రూ.30 వేలను డాక్యుమెంట్ రైటర్లు ఉంటున్న జనసేన పార్టీకి చెందిన నాయకుడి కాంప్లెక్స్‌లోని జిరాక్స్ సెంటర్‌లో విసిరేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ జిరాక్స్ సెంటర్‌లో ఉన్న మహిళను ఏసీబీ అధికారులు అక్కడ నుంచి కదలనీయకుండా నిలువరించారు.
సెల్‌ఫోన్లు స్వాధీనం:
కార్యాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో పాటు ఆన్‌లైన్‌లో ఆర్ధిక లావాదేవీలను పరిశీలించేందుకు దాదాపు 15 నుంచి 20 సెల్‌ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిరాక్స్ సెంటర్‌లో స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి నోట్లపై ఉన్న నంబర్లను రికార్డు చేశారు. అనంతరం కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్లలో నిక్షిప్తమైన రికార్డులను పలువురు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వాటిని ల్యాప్ ట్యాప్‌లలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు.
ఏసీబీ తనిఖీలతో నిలిచిన స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు:
ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలతో స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు బుధవారం నిలిచిపోయాయి. ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారికి సైతం అంతరాయం ఏర్పడింది. దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకూ ఏసీబీ అధికారులు బయట నుంచి ఎవరినీ లోపలకు అనుమతించలేదు. స్లాట్‌లు బుక్ చేసుకున్న వారికి అధికారులు గురు, శుక్రవారాల్లో సమయాన్ని కేటాయించారు.


