కూటమి నాయకుల కనుసన్నల్లోనే దళితులపై దాడి
రెడ్‌బుక్ రాజ్యాంగంలో దళితులపై తీవ్రమైన వివక్షకు ఇదే నిదర్శనం బాధితులకు సరైన చికిత్స అందించకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం నిందితులను వెంటనే అరెస్టు చేయాలి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బండ్లమూడి దళితులను పరామర్శించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున, చుండూరి రవిబాబు
ఒంగోలు టౌన్: కూటమి నాయకుల కనుసన్నల్లోనే బండ్లమూడి దళితుల మీద టీడీపీకి చెందిన శ్రీనివాసరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారని మాజీ మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన అగ్రకులాల వారి దాడిలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామానికి చెందిన దళితులు కంఠ్లం ఏసుదాసు, రామయ్య, ఎలిశమ్మ, ఏసోబు తదితరులను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. దాడికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులను బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దళితుల మీద దాడి జరిగి మూడు రోజులవుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాధికారులు కానీ స్పందించకపోవడం దారుణమని చెప్పారు. ప్రభుత్వ అండదండలతో దాడి జరగడమే దీనికి కారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏసుదాసు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఆయన ఇంటిలో జరిగిన ఒక వివాహంలో జగనన్న పాటలు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టడాన్ని సహించలేకనే తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాసరెడ్డి ప్యూహం ప్రకారం దాడికి పాల్పడ్డారని వివరించారు. పోలీసుల సమక్షంలో ఊరంతా చూస్తుండగానే కర్రలు, కత్తులతో దాడి చేయడం వెనక కూటమి నాయకుల ప్రోద్బలం ఉందన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు నిత్య కృత్యమైపోయాయని విమర్శించారు. తలలు పగిలి, చేతివేళ్లు విరిగి వైద్య చికిత్స కోసం జీజీహెచ్‌కు వస్తే సరైన చికిత్స చేయకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించడం విస్మయం కలిగిస్తోందన్నారు. చికిత్స కోసం వచ్చిన వారిని త్వరగా వెళ్లిపోండి, ఇక్కడ ఉంటే మా ఉద్యోగాలు పోతాయని బాధితుల మీద ఒత్తిడి చేసినట్లు తెలిసిందన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరిగిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బండ్లమూడి గ్రామాన్ని సందర్శించి బాధిత దళితులకు ధైర్యం చెప్పాలని కలెక్టర్, ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. నిస్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ బండ్లమూడిలో దళితుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో దళితుల మీద దాడులు నిత్యకృత్యమైపోయాయని ఆరోపించారు. అధికార పార్టీ అండ చూసుకునే నిందితులు పోలీసుల ఎదుటే దళితులపై దాడికి దిగారని చెప్పారు. బండ్లమూడి గ్రామంలోని దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు నాయుడు, బొట్ల రామరావు, చీమకుర్తి మండలాధ్యక్షుడు యుద్దనపూడి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవప్రసాద్, జిల్లా కార్యదర్శి కంభంపాటి సన్నిబాబు, కురిచేడు మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, మద్దిపాడు మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, దర్శి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జి.ఏసుదాసు, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమణయ్య, నగర అధ్యక్షుడు గోపి చంద్, చిన్నా, దేవరపల్లి రమణయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నం జనార్ధన్‌రావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దుడ్డు వినోద్, నాగులుప్పలపాడు మండల పార్టీ ఉపాధ్యక్షుడు కాటూరి ఆదెయ్య, యోహాన్, మలిశెట్టి దేవ పాల్గొన్నారు.


