చిన్నచూపు..
జిల్లాలో దళితులపై పెరిగిపోతున్న దాడులు ఎస్సీ నియోజకవర్గాల్లోనే దళితులకు రక్షణ కరువు బండ్లమూడి మాదిగలపై పోలీసుల సమక్షంలోనే మారణాయుధాలతో దాడి వివాహ వేడుకల్లో డీజే పెట్టారని తాళ్లూరులో మాదిగలను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కులం పేరుతో దూషించిన ఎస్సై మంత్రి నియోజకవర్గంలో బుద్దుడు, అంబేడ్కర్ చిత్రపటం ఊరేగింపును అడ్డుకున్న పచ్చ అగ్రకులస్తులు చికిత్స కోసం జీజీహెచ్‌కి వెళితే త్వరగా వెళ్లిపోండని వైద్యుల ఒత్తిళ్లు అధికార పార్టీ కనుసన్నల్లోనే దాడులంటూ మండిపడుతున్న దళిత సంఘాలు
కూటమి నేతల
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళితులు, బీసీలు, మైనార్టీలు సంప్రదాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉండడంతో సహించలేని కూటమి పాలకులు పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఒక్కసారి పరిశీలిస్తే దళితులపై కూటమి నేతలు కక్షగట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం జిల్లాలో కొత్త సంప్రదాయానికి తెరదీసింది. దళితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు డీజేలు పెట్టినా, వైఎస్సార్ సీపీ పాటలు పెట్టినా, ఆ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కట్టినా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉందనటానికి ఈ కింది ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఎస్సీ నియోజకవర్గాల్లోనే దళితులకు రక్షణ కరువు:
జిల్లాలో కొండపి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా దళితుల మీద దాడులు జరగడం గమనార్హం. టంగుటూరు మండలంలోని కారుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో అగ్రకుల ఉపాధ్యాయుడు. ఈ విషయంలో కేసు నమోదు చేయకుండా పోలీసులు చివరి వరకు ప్రయత్నాలు చేయడం వివాదాస్పదమైంది. వైఎస్సార్ సీపీ నేతలు రంగంలోకి దిగి బాధితురాలికి మద్దతుగా ధర్నాలు చేయడంతో దిగివచ్చిన పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో నిందితుడికి అధికార పార్టీ అండదండలు ఉండడం వల్లనే కేసు నమోదు చేయకుండా పోలీసులు హైడ్రామా నడిపారన్న విమర్శలు వచ్చాయి.
పెళ్లిలో జగన్ పాటలు పెట్టారన్న కక్షతో...
సంతనూతలపాడు నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. ఎస్సీ నియోజకవర్గంలో అధికార పార్టీ అండదండలు చూసుకొన్న అగ్రకులాలు దళితుల మీద బీహార్ తరహాలో కర్రలు, కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడులు చేయడం సంచలనం సృష్టించింది. చీమకుర్తి మండలంలోని బండ్లమూడి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కంఠ్లం ఏసుదాసు కుటుంబం ఆది నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఏసుదాసు ఇళ్లల్లో ఒక వివాహం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాటలు , వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్లెక్సీలను పెట్టారు. దీంతో మనసులో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలోనే ఏసుదాసు, రామయ్య, ఏసోబు, ఎలిశమ్మల మీద కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏసుదాసు కుటుంబం ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.
బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాల ఊరేగింపులకు విఘాతం:
రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలో ప్రపంచానికి శాంతిని బోఽధించిన బుద్ధుడికి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు అవమానం జరిగింది. బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని జరుగుమల్లి మండలంలోని కె.బిట్రగుంటలో గత ఏడాది అక్టోబర్ 10 తేదీన బుద్ధుడి చిత్రపటాన్ని ఊరిస్తున్న దళితులను అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రవర్ణ నేతలు అడ్డుకుని సీఐ, ఎస్‌ఐ సమక్షంలోనే దాడులకు తెగబడ్డారు. ఈఘటన మరువక ముందే ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఇదే గ్రామంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఊరేగించారు. దీన్ని సహించలేని అగ్రకులాలు ఊరేగింపు జరగకుండా అడ్డుకున్నారు. వీరిపై కేసు నమోదు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, దళిత సంఘాలు ధర్నాలు నిర్వహించారు. కల్టెకర్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఆ తర్వాత పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో దళితులు అంబేడ్కర్ పాటలు పెట్టారని దాడి జరిగింది. టంగుటూరు మండలంలోని కాకుటూరిపాలెంలో తాజాగా అంబేడ్కర్ కమ్యూనిటీ స్థలం విషయంలో వివాదం కొనసాగుతోంది. ఇక్కడ కూడా పోలీసులు దళితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహానికి గురైన దళిత యువకులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు.
జీజీహెచ్‌లోనూ వివక్షే...
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ వ్యవస్థలను రాజకీయ వేదికలుగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా, ఘర్షణలు, దాడులు జరిగినా ఒంగోలు జీజీహెచ్‌కు తరలించడం సర్వసాధారణం. అయితే దళితుల మీద దాడి జరిగినప్పుడు జీజీహెచ్‌కు తీసుకొస్తే వైద్యుల నుంచి సహాయ నిరాకరణ జరుగుతోందని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసుకోకుండా సవాలక్ష సాకులు చెబుతున్నారని, ఒకవేళ ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నా త్వరగా వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బండ్లమూడి దళితులను కూడా ఆస్పత్రికి వచ్చిన రోజు రాత్రే వెళ్లి పోవాలంటూ వైద్యులు ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వెంటనే రంగంలోకి దిగిన ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో మాట్లాడిన తరువాత వారికి వైద్యం చేయడానికి వైద్యులు అంగీకరించినట్లు సమాచారం. ఆస్పత్రి సిబ్బందిపై ఇప్పటికే దళిత సంఘాల నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. అధికార పార్టీ హకుంతోనే వైద్యులు ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
బండ్లమూడిలో పోలీసు సమక్షంలోనే అధికార పార్టీ అగ్రవర్ణాల దాడిలో గాయపడిన దళితులు
వివాదాస్పదంగా తాళ్లూరు ఎస్‌ఐ ప్రవర్తన
దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం శివరాంపురం ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి వివాహ వేడులు జరిగాయి. ఈ సందర్భంగా డీజే పెట్టుకున్నారు. పెళ్లి కూతురిని మండపం వద్దకు తీసుకెళుతున్న సమయంలో డీజే పెట్టి నృత్యాలు చేస్తున్న దళిత యువకులను పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే నిర్వాహకుడిని పోలీసు స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై మల్లికార్జునరావు దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడని నిర్వాహకుడు అనపర్తి విజయకుమార్ ఆరోపిస్తున్నారు. ఇదేమిటని అడగటానికి వచ్చిన తన తండ్రిని కూడా దుర్భాషలాడారని వాపోతున్నాడు. పోలీసుల అనుమతి లేకుండా డీజే పెట్టకూడదన్న చట్టం ఉంటే దాన్ని అందరికీ అమలు చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఐ తీరుపై జిల్లాలోని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ వర్గాలు డీజేలు పెట్టుకున్నా, పార్టీ పాటలతో హోరెత్తించినా కన్నెత్తిచూడని పోలీసులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల విషయంలో మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో దళితులపై దాష్టీకాలకు హద్దులేకుండా పోతోంది. పచ్చ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. వారిపై దాడులు చేయడమే కాకుండా ఎదురు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్, ప్రపంచానికి శాంతిని బోధించిన బుద్ధుడి చిత్రపటాలను ఊరేగించడం నేరమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లల్లో శుభకార్యాలకు డీజేలు పెట్టుకున్నా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనలు జిల్లాలో ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చని దళిత సంఘాలు మండిపడుతున్నాయి.


