పన్నుల బాదుడే..
ఆస్తి పన్ను భారంపై
ఆందోళన చెందుతున్న భవన యజమానులు
జిల్లాలో ఉన్న పురపాలక సంఘాల్లో పన్నుల ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలులో 63,466 భవనాలు ఉండగా రూ.51.17 కోట్ల ట్యాక్స్ డిమాండ్ ఉంది. అలాగే మార్కాపురంలో 17,143 భవనాలకు రూ.9.41 కోట్లు, గిద్దలూరులో 11,768 భవనాలకు రూ.4.70 కోట్లు, దర్శిలో 9,438 భవనాలకు రూ.4.63 కోట్లు, కనిగిరిలో 9,427 భవనాలకు రూ.4.65 కోట్లు, చీమకుర్తిలో 6,726 భవనాలకు రూ.3.61 కోట్లు, పొదిలిలో 10,818 భవనాలకు రూ.3.84 కోట్ల ట్యాక్స్ డిమాండ్ ఉంది. జిల్లాలో మొత్తం 1,28,786 భవనాలకు రూ.82.00 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మార్కాపురం పట్టణ వ్యూ
మార్కాపురం టౌన్:
కూటమి ప్రభుత్వం ఆస్తి పన్ను మోత మోగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల వేళ అధికార పీఠం కోసం లెక్కకు మిక్కిలిగా ఇచ్చిన హామీల్లో ఆస్తి పన్నులు పెంచబోమనేది ఒకటి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పన్నుల కొరడా ఝులిపించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కంటే 20 శాతం అదనంగా పట్టణ వాసులపై పన్నుల భారం మోపింది. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి గతంలో ఎన్నడూ లేని నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇంటి ప్లాన్ అప్రూవల్ పత్రాలను పరిశీలించాలని పురపాలక శాఖ అధికారులను పురమాయింది. ఇంటి ప్లానులో 10 శాతం ఉల్లంఘిస్తే 25%, పది శాతం పైన ఉల్లంఘిస్తే 50%, ఇంటి ప్లాన్ లేకపోతే 100% పన్ను, ఇంటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే రెండున్నర రెట్ల పన్ను వసూలు చేయాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా పన్ను పెంచేయడంపై పౌర సమాఖ్య నాయకులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నా సర్కారు అదేమీ పట్టించుకోకుండా తన పంథాలో ముందుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఎన్నికల హామీకి విరుద్ధంగా వ్యవహరించి పెంచిన పన్నుతో డిమాండ్ నోటీసులు జారీ చేస్తుండటంపై గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు.
కూటమి మాట.. నీటి మూట
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని ఎన్నికల ముందు గప్పాలు కొట్టిన కూటమి నాయకులు మాట తప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత సంపదను పెంచుకోవడంపై దృష్టి సారించారే గానీ ప్రజలకు పైసా లబ్ధి చేకూర్చే పనులు చేపట్టలేదు. పైగా పన్నుల బాదుడు, కరెంటు చార్జీల పెంపుతో ప్రజల సొమ్మును గుంజుతూ ఆర్థికంగా పిప్పి చేస్తున్న దుస్థితి. మున్సిపాలిటీల్లో అభివృద్ధికి ప్రత్యేక నిధులేవీ కేటాయించకపోగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సైతం సక్రమంగా వినియోగించడం లేదన్న ఆరోపణలున్నాయి. వసూలైన పన్నుల ఆదాయంతోనే పట్టణాలను అభివృద్ధి చేసుకోండని ఆ శాఖ అధికారులకు కూటమి ప్రభుత్వ పెద్దలు మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. ఒంగోలు నగరంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో పన్నుల బాదుడుపై మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎడతెగని చర్చ నడిపారు. ప్రజల నుంచి ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేయడమే సదరు చర్చల సారాంశం. ఒంగోలు నగరంలో ప్రసుత్తం వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా మరో రూ.10 కోట్లు రాబట్టాలని కౌన్సిలర్లు, అధికారులు సంయుక్తంగా నిర్ణయించడం గమనార్హం. ఒడా నిబంధనలను బూచిగా చూపి అపార్ట్‌మెంట్ల యజమానులను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సంస్థ అధికారులు పన్నులు బాదేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.
సంపద సృష్టి!
జిల్లాలో 1,28,786 భవనాలకు రూ.82 కోట్ల
ఆస్తి పన్ను డిమాండ్
మున్సిపాల్టీల్లో మళ్లీ ఇంటింటి
సర్వే చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
జిల్లాలో ఆస్తి పన్ను డిమాండ్ ఇలా..
పన్నుల బాదుడే..


