వైట్ బర్లీ పొగాకును నియంత్రించాల్సిందే..
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా వైట్ బర్లీ పొగాకు సాగును నియంత్రించాలని వ్యవసాయ శాఖ, పొగాకు బోర్డు అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీ కోసం భవన్‌లో ప్రభుత్వ విభాగాలు, పొగాకు కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రస్తుత రబీ సీజన్‌లోనే వైట్ బర్లీ పొగాకు సాగు నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. వైట్ బర్లీ పండించే రైతులతో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఆ ఒప్పంద పత్రాల కాపీలు తీసుకోవాలని బోర్డు అధికారులకు సూచించారు. వైట్ బర్లీ పొగాకు పండిచే రైతుల జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులతో ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలు పొగకు కొనుగోలు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని, కంపెనీ ప్రతినిధుల ఫోన్ నంబర్లను రైతులు, వ్యవసాయ అధికారులకు అందుబాటులో ఉంచాలని జేసీ స్పష్టం చేశారు. సమావేశానికి హాజరైన కొన్ని కంపెనీ ప్రతినిధులు జేసీ ఆదేశాలపై స్పందించారు. తమ ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా వైట్ బర్లీ కొనుగోలు విషయమై ఈ నెల 26వ తేదీన మరోమారు సమావేశం నిర్వహిస్తామని, పూర్తి నివేదికలతో హాజరుకావాలని వ్యవసాయ అధికారులను, కంపెనీ ప్రతినిధులను జేసీ ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఎస్.శ్రీనివాసరావు, టుబాకో బోర్డు ఆర్‌ఎం రామారావుతోపాటు వివిధ పొగాకు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాల వారీగా పొగాకు సాగు
వివరాలు నమోదు చేయాలి
టుబాకో బోర్డు, వ్యవసాయాధికారుల సమావేశంలో జేసీ గోపాలకృష్ణ


