బడుగులేరులో భయం..భయం
ఒకేసారి 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఆందోళన కారణం ఏమై ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ మంచినీరు, పారిశుధ్యంపై అనుమానాలు ఎవరి నిర్లక్ష్యం కారణమంటూ ఆరా తీస్తున్న ఉన్నతాధికారులు విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందన్న డీఎం అండ్ హెచ్‌ఓ
సురక్షిత నీటి సరఫరా ఏది..?
కనిగిరి రూరల్: మండలంలోని బడుగులేరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 9 మంది వారం రోజుల నుంచి అనారోగ్యంతో అవస్థపడుతూ ఆస్పత్రి పాలవడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. విద్యార్థుల అనారోగ్యంపై స్పందించి తక్షణమే ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన నాలుగు శాఖల అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం కలెక్టర్ ఆదేశాలతో ఆలస్యంగా కదిలిన అఽధికార యంత్రాంగం.. తక్షణ చర్యలపై ఇంకా నత్తనడక నడుస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ప్రచారం కోసం తాత్కాలిక చర్యలతో హడావిడి చేశారే తప్ప.. క్షేత్ర స్థాయిలో సరైన కారణాలు తెలుసుకుని సురక్షిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని శాఖల నిర్లక్ష్యమే కారణమా..?
ఒకే ఎస్సీకాలనీలో సుమారు 9 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వీరంతా ఒకే పాఠశాలకు చెందిన వారు. వీరందరిదీ ఒకే ఏరియా కావడంతో అందరూ తాగుతున్నది డీప్ బోర్ వెల్ నీరే. పైగా, నీటి కలుషితం వలనే కామెర్లు వచ్చే అవకాశం ఉందని వైద్య శాఖ ఉన్నతాధికారులు సైతం వెల్లడించారు. దీన్నిబట్టిచూస్తే.. ఆర్‌డబ్ల్యూఎస్, హెల్త్, విద్య, సచివాలయాలు.. ఇలా అన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులకు కామెర్లు వచ్చినట్లు తెలుస్తోంది. వారి కళ్లు పచ్చగా మారడం, యూరిన్ రంగు మారడం వంటివి గుర్తించి రెండ్రోజులు అయినప్పటికీ.. వైద్య పరీక్షలు చేయించుకుంటున్నప్పటికీ.. తక్షణం స్పందించాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఎందుకు నిర్లక్ష్యం వహించింది..? వైద్య శాఖ అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఎందుకు ఏర్పాటు చేయలేదు..? ఒకే కాలనీకి, ఒకే స్కూల్‌కి చెందిన 9 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైతే టీచర్లు, విద్యాశాఖ అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు..? సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు ఎందుకు అలసత్వం ప్రదర్శించారనే ప్రశ్నలకు సమాధానం లేదు.
అధ్వానంగా పారిశుధ్యం...
బడుగులేరు గ్రామంలోని ఎస్సీకాలనీలో పారిశుధ్యం మరీ అధ్వానంగా ఉంది. కాలనీలో మురికినీటి కాలువలు లేకపోవడంతో కొన్ని ఇళ్ల ప్రాంగణంలోనే మురుగునీటి మడుగులు కనిపిస్తున్నాయి. ఏ వీధి చూసినా ఏముంది గర్వకారణం..సర్వం మురుగుమయం అన్న చందంగా కాలనీ తయారైంది.
బడుగులేరును సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు...
బడుగులేరు గ్రామాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, అర్డీఓ బి.కేశవర్దన్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యాశాఖ, వైద్య శాఖ జిల్లా అధికారులు సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులతో పాటు గ్రామస్తులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణ వైద్యంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు.
గ్రామంలో విద్యార్థుల అనారోగ్యంపై రెండ్రోజుల నుంచి హడావిడి జరుగుతోంది. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాన్ని సందర్శించారు. కానీ, గురువారం నాటికి కూడా సురక్షిత జలాలను కాలనీ వాసులకు ఇవ్వలేదు. దీంతో వాటర్ ప్లాంట్ల నుంచి ఆటోల్లో గ్రామాలకు సరఫరా చేసే వాటల్ బబుల్స్‌ను రూ.10 చొప్పున కొనుగోలు చేసి గ్రామస్తులు తాగుతున్నారు. ఓవైపు వైద్య శాఖ జిల్లా అధికారి జీ వెంకటేశ్వర్లు కాలనీల్లోని డీప్ బోర్లను తొలగించి ట్యాంకర్ల ద్వారా సురక్షిత నీటిని స్థానికులకు అందిస్తున్నట్లు విలేకర్ల సమావేశంలో తెలియజేస్తుండగా, గురువారం సాయంత్రం వరకూ కూడా అది అమలు కాలేదు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కామెర్లకు సంబంధించిన హెపటైటిస్ సీ వంటి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించామని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో నీటి కాలుష్యం జరిగి ఉంటుందని, అందువలనే కామెర్లు వచ్చి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. డీఈఓ కిరణ్‌కుమార్ బడుగులేరు పాఠశాలలోని ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యార్థుల పరిస్థితిపై చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు.


