కూటమి చేతగానితనం.. 2,450 మెడికల్ సీట్లు దూరం
మద్దిపాడు: కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు ప్రజల ఆస్తిని ధారాదత్తం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున విమర్శించారు. గురువారం మద్దిపాడు మండలంలోని దొడ్డవరం ఎస్సీ కాలనీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మించడానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు నిలిపేసి పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి సీఎం చంద్రబాబు జేబులు నింపుకోవడానికి కుట్ర చేవారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ చేతగానితనం వల్ల గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ 2,450 మెడికల్ సీట్లను కోల్పోయిందని వివరించారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య అందడం ఇష్టం లే, ఏకంగా వైద్య కళాశాలకు సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడు సీఎం చంద్రబాబు అని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాడుతున్నా చంద్రబాబు చెవికెక్కించుకోవడం లేదన్నారు.
ప్రజల సొమ్ముతో గాలికి తిరుగుతున్నారు
ప్రజల సొమ్ముతో కూటమి నాయకులు హైదరాబాద్ టు గన్నవరం ఎయిర్‌పోర్టుకు విమానాల్లో షటిల్ సర్వీస్ చేస్తున్నారని మాజీ మంత్రి మేరుగు విమర్శించారు. వీరు ఒక ఏడాదిలో దుబారా చేసిన ప్రజా ధనంతో వైద్య కళాశాలలన్నీ పూర్తి చేసి ప్రభుత్వమే నడిపేలా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. ఒక వైపు వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ.. దీనిపై ప్రజల దృష్టిని మరలించడానికి నకిలీ మద్యం పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదని, రెండు ప్రభుత్వ్లా మధ్య తేడాను వారు గమనిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు చేసిన మంచిని, ప్రస్తుత ప్రభుత్వ తీరును కూడా గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ నియోజకవర్గాల్లోనే పనులు సక్రమంగా చేసుకోలేకపోతున్నారని, ప్రజలకు వారు ఇంకేం చేస్తారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు కొమ్మూరి సుధాకర్, నాదెండ్ల మహేష్,పూనూరి రమేష్, రామయ్య కోటయ్య, గాంధీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వైద్యం, విద్య అందకుండా
సీఎం చంద్రబాబు కుట్ర
చంద్రబాబు, లోకేష్, పవన్ ఏడాది దుబారా ఖర్చుతో కాలేజీలు కట్టేయొచ్చు
మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖలు రాయడం దుర్మార్గం
కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి మేరుగు
నాగార్జున ధ్వజం


