
గనుల శాఖపై నిరంతర పర్యవేక్షణ
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: గనుల శాఖకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ పి.రాజాబాబు గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గనుల శాఖ అధికారులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, ప్రభుత్వానికి రావాల్సిన రాబడిపై, గనుల రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.432.94 కోట్లు రాబడి లక్ష్యం నిర్దేశించగా, సెప్టెంబర్ నెల వరకు రూ.157.08 కోట్లు వచ్చిందన్నారు. జిల్లాలో మేజర్, మైనర్ మైనింగ్ క్వారీలు ఉండగా, అందులో 144 క్వారీలు పనిచేస్తున్నాయని, 132 క్వారీలు పనిచేయడం లేదని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రాబడి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మైనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగరాదని స్పష్టం చేశారు. జిల్లాలో ఏ కారణం చేతనైనా మైనింగ్ క్వారీ జరగకపోతే సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ గనుల శాఖ డీడీని ఆదేశించారు.