కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..! | - | Sakshi
Sakshi News home page

కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..!

Oct 12 2025 6:31 AM | Updated on Oct 12 2025 6:31 AM

కర్నూ

కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..!

కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..!

ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు సమీపంలోని బ్రిడ్జిపై ఉన్న గొయ్యి

ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు సమీపంలో ఉన్న బ్రిడ్జి మీద రోడ్డు దెబ్బతిని నెల రోజుల క్రితం గొయ్యి ఏర్పడింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిపై పెద్ద గొయ్యి పడి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీనిపై గత నెల 22వ తేదీ సాక్షి దినపత్రిక ఒంగోలు క్లస్టర్‌ పేజీలో ‘రహదారి ఇలా.. రాకపోకలు సాగేదెలా’ అనే శీర్షికతో గొయ్యికి సంబంధించిన ఫొటోలతో కథనం కూడా ప్రచురితమైంది. ఇరవై రోజులైనా అధికారులుగానీ, పాలకులుగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం ఆ గొయ్యి పెద్దదిగా మారి మరింత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వ అధ్వానపు పరిపాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పైగా, ఆ గొయ్యి వద్ద అడ్డంగా పోలీసులు బ్యారికేడ్‌ ఏర్పాటు చేసి నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని వాహనదారులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అసలే వంతెన కావడంతో ఆ గొయ్యి వద్ద ఏమాత్రం ప్రమాదం జరిగినా భారీ నష్టం జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

గ్రానైట్‌ రాళ్లతో భారీ వాహనాల

రాకపోకలతో ప్రమాదం జరిగే అవకాశం...

చీమకుర్తి మండలంలోని రామతీర్థం గ్రానైట్‌ క్వారీల నుంచి గ్రానైట్‌ రాళ్ల ఓవర్‌ లోడుతో నిత్యం భారీ టిప్పర్లు, ట్రాలీలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జిపై గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో సగం రోడ్డుకు అడ్డంగా పోలీసులు బ్యారికేడ్‌ ఏర్పాటు చేసి వదిలేయడంతో అక్కడ సగం రోడ్డుపైనే వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉంది. దీంతో అక్కడ ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పైగా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి కింద నీటి ప్రవాహం ఎక్కువై రోడ్డు మరింత దెబ్బతింటోంది. ఫలితంగా ఆ బ్రిడ్జి మధ్యలో ఏర్పడిన గొయ్యి సైజు పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ పాలకులుగానీ, అధికారులుగానీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లను సూపర్‌గా చేశామని సీఎం, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతుండటంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. నడిరోడ్డుపై ఉన్న గోతులు కూడా పూడ్చకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు.

20 రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితమైనా స్పందించని అధికారులు, పాలకులు

ప్రస్తుతం మరింత పెద్దదిగా మారి ప్రమాదకరంగా మారిన గొయ్యి

కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..! 1
1/1

కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement