
శివాలయంలో చోరీ
దొనకొండ: మండలంలోని మంగినపూడి శివాలయంలో దుండగులు ఆదివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. శివాలయం గేటు తాళం పగలకొట్టి కానుకల హుండీని తీసుకువెళ్లి పక్కనే చెరువులో పడేసి, అందులోని కానుకలను తీసుకువెళ్లారు. శివాలయం ఎదురు బడ్డీ కొట్టులో తాళం పగలకొట్టి అందులోని పెట్రోలు, ఇతర తిను బండారాలు, సిగరెట్లు, కూల్‌డ్రింక్స్ సీసాలు, కొంత నగదు తీసుకువెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే శివాలయంలో చోరీకి పాల్పడి విలువైన వస్తువులు అపహరించారని గ్రామస్తులు తెలిపారు.
రెండు చెక్ బౌన్స్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష
ఒంగోలు: రెండు వేర్వేరు చెక్ బౌన్స్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి వి.వెంకటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. వెలిది బాలాజీ బాబు అనే వ్యక్తి వద్ద నలగర్ల ప్రసాద్ అనే వ్యక్తి రెండు దఫాలుగా రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ చెల్లింపు నిమిత్తం రూ.9,03,800 విలువైన చెక్కు జారీచేయగా, దానిని వెలిది బాలాజీ బాబు బ్యాంకులో జమచేయగా బౌన్స్ అయింది. దీంతో బాలాజీ బాబు కోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయమూర్తి.. నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితుడు నలగర్ల ప్రసాద్‌కు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో పాటు ఫిర్యాదికి రూ.17,97,600 చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు జరిమానా విధించారు.
మరో కేసులో...
చిల్లర నందకిషోర్ అనే వ్యక్తి వద్ద పొత్తూరి బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ నిమిత్తం రూ.8 లక్షలకు చెక్కు జారీ చేయగా నందకిషోర్ బ్యాంకులో జమచేశాడు. అది బౌన్స్ అయినట్లు నిర్ధారణ అయింది. దీంతో నంద కిషోర్ కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన న్యాయమూర్తి నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, ఫిర్యాదికి రూ.12 లక్షలు చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు జరిమానా విధించారు.