
హాస్టళ్లు తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సోమవారం పట్టణంలో ఉన్న హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ బాలికలు, బాలుర హాస్టళ్లలో ఉన్న విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఆయా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. శుభ్రమైన భోజనం, శుద్ధి చేసిన నీటిని విద్యార్థులకు అందించాలని వార్డన్‌లకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి ఉన్నారు.
ఒంగోలు సబర్బన్: సురక్షితమైన జీవితానికి ఏడు సూత్రాలు పాటిస్తే అనారోగ్యంపాలు కాకుండా చేసుకోవచ్చని కలెక్టర్ పీ.రాజాబాబు పేర్కొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ముద్రించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీ కోసం భవన్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, యూనిసెఫ్, విజయ వాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ పీ.రాజాబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ముఖ్యమైన ఏడు సందర్భాల్లో చేతులను కడుక్కోవడం అలవాటుగా చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్‌ఓ ఓబులేసు, జిల్లా విద్యాధికారి కిరణ్ కుమార్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ టీ రంగారావు, వాష్ ప్రోగ్రాం ప్రతినిధి కే మరియబాబు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని పాకల బీచ్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ప్రజా రవాణాధికారి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొదిలి ఆర్టీసీ డిపో నుంచి ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు ట్రిప్పులు వేసినట్లు చెప్పారు. కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి కందుకూరు మీదుగా 4 బస్సు సర్వీసులు, కందుకూరు డిపోలో 6 బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూపుల వారీగా వనభోజనాలకు వెళ్లే వారికి అద్దె ప్రతిపాదికన ప్రత్యేక బస్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.