
గడువు లోగా పరిష్కరించాలి
● ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువు లోగా చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన శ్రీప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, పార్ధసారధి, విజయజ్యోతిలు అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, ఆ నమ్మకాన్ని ప్రతి అధికారి నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి అర్జీని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీపీఆర్‌పై మాక్‌డ్రిల్
ఈ సందర్భంగా సీపీఆర్‌పై మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఆకస్మాత్తుగా ఎవరైనా గుండెపోటుతో పడిపోతే ఏ విధంగా సీపీఆర్ చేయాలో వైద్యులు అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్ నిర్వహిచంచారు. ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, డీసీహెస్ డార్టర్ సూరిబాబు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సీపీఆర్ చేయాల్సిన పద్ధతిని వివరించారు.