
తొలి మద్యం తయారీ కేంద్రం కుప్పం
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో మొదటి డిస్టిలరీ ఫ్యాక్టరీ కుప్పంలోనే ప్రారంభం అయిందని.. చివరి డిస్టిలరీ కేంద్రం విశాఖపట్టణంలో ఏర్పాటు చేశారని, అదికూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు చెందిందని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొని వచ్చింది మద్యం కంపెనీలు తప్ప ప్రజలకు మంచి చేసే కంపెనీలు తేలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు నవరత్నాల పథకం కింద అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు ఎంతో మేలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి అన్నీ చేశామని డప్పాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళలు, రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపడుతుంటే అరకొరగా పథకాలను అమలు చేశారని చెప్పారు.
అబద్ధాల ప్రచారంలో దిట్ట..
ఇటీవల సూపర్ సిక్స్–సూపర్ సక్సెస్ అని మూడు హామీలు సీ్త్రశక్తి, నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాల పింఛన్ ఎత్తివేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గ్లోబల్ ప్రచారం చేయడం మొదలు పెట్టారని ఆయన అన్నారు. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే మనం వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పేద ప్రజలకు తాము కూడా అన్యాయం చేసినవారమవుతామన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రామాలలో ప్రజలకు అవగాహన పరచాలని, వారిలో చైతన్యం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, ఆళ్ల ఆంజనేయరెడ్డి, గుమ్మా ఎల్లేష్ యాదవ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, ఆర్.వాగ్యానాయక్, పార్టీ మండల కన్వీనర్‌లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాళ్ళ వెంకటేశ్వర్లు, పి.కృష్ణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల రాష్ట్ర. జిల్లా నాయకులు ఉడుముల అరుణ, ఆర్.అరుణాబాయి, పొన్న వెంకటలక్ష్మి, పల్లె సరళ, గార్లపాటి శార, కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, కందూరి కాశీవిశ్వనాథ్, పి.రాములు నాయక్ పాల్గొన్నారు.