
వాగులో పడి బాలుడు మృతి
గిద్దలూరు రూరల్: వాగులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని గడికోట గ్రామ సమీపంలో గల సగిలేరువాగు వద్ద శనివారం జరిగింది. గడికోట గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (15) గేదెలను మేపేందుకు వాగు సమీంలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో గేదెలు వాగులో ఉండటం వల్ల వాటిని బయటకు తోలేందుకు వాగులోకి దిగాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ వాగు లోతట్టు ప్రాంతంలో చిక్కుకుని మునిగిపోయాడు. స్థానికులు అతడిని వాగులో నుంచి బయటకు తీసేలోపే మృతి చెందాడు. హుస్సేన్ ముండ్లపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో గేదెలను మేపేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులకు హుస్సేన్ పెద్ద కుమారుడు కాగా, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు.