
నెత్తిన బండేశారు..
చీమకుర్తి:
ఉరుము ఉరిమి మంగళంపై పడినట్టు గ్రానైట్ పరిశ్రమపై ఏఎంఆర్ ప్రైవేటు కంపెనీ విధి విధానాల పిడుగు పడ్డట్టయింది. ప్రభుత్వం, ఏఎంఆర్ కంపెనీ సంయుక్తంగా గ్రానైట్ పరిశ్రమపై దోపిడీకి తెరతీయడం గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులను ఆగ్రహానికి గురిచేసింది. అంతంత మాత్రంగానే ఉన్న వ్యాపారులను ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటోందని ఫ్యాక్టరీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న స్లాబ్ విధానంలో గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సింగిల్ బ్లేడ్ పై రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌పై రూ.54 వేలు చెల్లించే వారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న కొత్త విధానాలతో సింగిల్ బ్లేడ్‌పై అదనంగా రూ.8 వేలు అంటే జీఎస్‌టీ మొత్తం కలిపి రూ.35 వేలు, మల్టీ బ్లేడ్‌పై అదనంగా రూ.16 వేలు కలుపుని రూ.70 వేలతో పాటు జీఎస్‌టీ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ గ్రానైట్ ఫ్యాక్టరీల మనుగడకే ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ఫ్యాక్టరీల యజమానులు మంగళవారం చీమకుర్తిలో సమావేశమై ఈనెల 1వ తేదీ బుధవారం నుంచి జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలను మూసేయాలని తీర్మానించారు. ప్రైవేటు ఏఎంఆర్ కంపెనీకి మేలు చేసేలానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
30 వేల మంది కార్మికులపై ప్రభావం..
చీమకుర్తి మండలంలోని చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ, ఏలూరు రోడ్డు పరిధిలోని నాలుగు గ్రానైట్ ఫ్యాక్టరీల సంఘాలకు సంబంధించి సుమారు 1200 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవన్నీ బుధవారం నుంచి మూతపడనున్నాయి. తీర్మానాలలో ఇక నుంచి ప్రభుత్వానికి మైనింగ్ బిల్లులు చెల్లించకూడదని, క్వారీల నుంచి ముడిరాయిని కొనుగోలు చేయొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంద్ సందర్భంగా ఫ్యాక్టరీలను మూసేయాలని ఫ్యాక్టరీ యజమానులు తీర్మానం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2500 ఫ్యాక్టరీలు ఉన్నట్లు అంచనా. వాటిలో ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, బీహార్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు దాదాపు 30 వేల వరకూ ఉంటారు. ఫ్యాక్టరీలను మూసేస్తే వీరి జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రైవేటు దోపిడీ వెనుక మతలబు ఏమిటీ?
ప్రకాశం జిల్లాలోని గ్రానైట్, దాని అనుబంధ మినరల్స్‌పై ఇప్పటి వరకు ప్రభుత్వమే నేరుగా సీనరేజీ వసూలు చేస్తోంది. దాని ద్వారా మేజర్ మినరల్స్(ఇసుక)ను మినహాయిస్తే గ్రానైట్, గ్రావెల్ ఇతర చిన్నా చితక మినరల్స్‌పై ప్రభుత్వానికి ప్రస్తుతం ఏడాదికి రూ.500 కోట్లు వంతున రెండేళ్లకు రూ.1000 కోట్లు రాయల్టీ వస్తోంది. అలాంటిది ఇప్పటి వరకు ఉన్న సీనరేజి రాయల్టీ వసూళ్లలో ఉన్న సూపర్ గ్యాంగ్‌సా, గ్యాంగ్‌సా, కట్టర్ సైజు, ఖండాస్ అనే నాలుగు రకాలు గ్రానైట్ బ్లాకులను రెండు రకాలుగా విభజించి సీనరేజిలో కూడా సగానికి పైగా తగ్గించి ఏఎంఆర్ కంపెనీకి మేలు చేసేందుకు ప్రభుత్వం జీఓ నెంబర్ 100ను గడిచిన జూన్ నెలలోనే జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వంతో అవగాహన కుదిరిన ఏఎంఆర్ కంపెనీ నెలకు రూ.47 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.1135 కోట్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసి జిల్లాలో రాయల్టీ వసూలుకు ఏర్పాట్లు చేసుకుంది. దానిలో భాగంగానే రెండు రోజుల క్రితం ఒంగోలులో గ్రానైట్ క్వారీల యజమానులతోను, అనంతరం ఫ్యాక్టరీల యజమానులతో ఏఎంఆర్ కంపెనీ చర్చించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారికంగా చెల్లించాల్సిన రాయల్టీతో పాటు అనధికారకంగా ఒక్కో ఫ్యాక్టరీలోని సింగిల్ బ్లేడ్‌కు రూ.35 వేలు చెల్లించాలని ఏఎంఆర్ కంపెనీ డిమాండ్ చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాక్టరీల యజమానులు అసలు మేము ఫ్యాక్టరీలనే నడపమని, ఫ్యాక్టరీలను మూసేస్తున్నామనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏఎంఆర్ కంపెనీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా మారింది. ఏం చేయాలో తెలియక గత నెల 29న మైన్స్ అధికారులతో చేసుకోవాల్సిన ఒప్పందం ఈ నెల 9వ తేదీ లోపు చేసుకుంటామని ఏఎంఆర్ కంపెనీ యూటర్న్ తీసుకుంది.
నేటి నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసేస్తున్నాం...
ఏఎంఆర్ ఒప్పందంలోని అదనపు భారం కారణంగా ఈ రోజు నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసేయాలని ఫ్యాక్టరీల సంఘం తీర్మానించింది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలపై ప్రైవేటు కంపెనీలకు సీనరేజి వసూళ్ల బాధ్యతను ప్రభుత్వం ఇవ్వడం వలన ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
– యర్రగుంట్ల శ్రీనివాసరావు, ఫ్యాక్టరీల సంఘం నాయకుడు
ఈనెల 9లోపు ఒప్పందం చేసుకుంటారు...
వాస్తవానికి గతనెల 29న మైన్స్ అధికారులతో ఏఎంఆర్ కంపెనీ ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. దానిని ఈనెల 9వ తేదీ లోపు అగ్రిమెంట్ చేసుకుంటామని ఆ కంపెనీ వారు తెలిపారు.
– టీ.రాజశేఖర్, మైన్స్ డీడీ, ఒంగోలు
మాట మరిచిన లోకేష్..
యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులతో సదస్సు నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించి మాట మరిచారని పరిశ్రమల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెత్తిన బండేశారు..