
అనితమ్మా.. చలపతి చౌదరికి క్షమాపణ చెప్పాలి
యర్రగొండపాలెం: ‘‘ఏపీ హోం మంత్రి అనితమ్మా.. నా నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని గుర్రం చలపతి చౌదరిపై మీరు ప్రస్తావించిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని’’ యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. చలపతి చౌదరి కాదని, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడని అనిత చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ఒక అసత్యపు ప్రచారాన్ని మీరు తీసుకొచ్చి, కమ్మ కులంలో కూడా పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఆక్రోశంతో మీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఆ బిడ్డకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలంలోని మేడపి గ్రామానికి చెందిన చలపతి కమ్మ కులానికి చెందినవాడని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వీరాభిమాని అని అన్నారు. అటువంటి వ్యక్తి మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను, కూటమి నేతలు చేస్తున్న దాడులు, దోపిడీలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని ముందు వెనక చూసుకోకుండా హోం మంత్రిగా బాధ్యతను మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం కూటమి ప్రభుత్వ పనితీరు, అవివేకాన్ని ఎత్తి చూపుతున్నాయని అన్నారు.