
7న ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈనెల 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు చెన్నుపాటి మంజుల పిలుపునిచ్చారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్టీయూ భవన్‌లో సన్నాహక సమావేశం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కాగుటూరి యర్రయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని తెలిపారు. రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడం గానీ, చర్చించిన పరిస్థితి కానీ లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన దాదాపు రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినా ఇంతవరకు స్పందన లేదన్నారు. ఫ్యాప్టో చైర్మన్ కాగుటూరి యర్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యా రంగ, ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ ఎస్.కే రఫి, కో చైర్మన్ వీ మాధవరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్ రవి, డీ శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు చల్లా శ్రీనివాసులు, వై సీనయ్య , కే దేవ సహాయం, బీ అశోక్, తదితరులు పాల్గొన్నారు.