
బాధితులకు భరోసా కల్పించాలి
● జిల్లా పోలీసు అధికారులతో
ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ఒంగోలు టౌన్: సకాలంలో స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా పోలీసు అధికారులకు ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు. జిల్లాలోని అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్నీ సబ్‌డివిజన్ల పరిధిలోని ప్రస్తుత పరిస్థితులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు, జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదయ్యే ప్రాంతాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పేకాట, కోడి పందేలు, మట్కా, సింగిల్ నెంబర్ లాటరీ వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై నిఘా ఉంచాలని, చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలను, దైనందిన జీవన విధానాన్ని పరిశీలించాలని, ఏదైనా అనుమానం వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నేర నియంత్రణ, పరిశోధన వేగవంతం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైనా వైరల్ అయిన విషయం పట్ల నిజనిజాలను ప్రకారం నడుచుకోవాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనలో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని, పారదర్శక, నిష్పక్షపాత పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. కీలక కేసులను గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో ట్రయల్స్ జరిపించి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఎఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, నాగరాజు, కె.శ్రీనివాసరావు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
హాజరైన ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు
మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు

బాధితులకు భరోసా కల్పించాలి