
12వ పీఆర్‌సీ ప్రకటించాలి
● సీఐటీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
ఒంగోలు సబర్బన్: 12వ పీఆర్‌సీ ప్రకటించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ నగర కన్వీనర్ టి.మహేష్ మాట్లాడుతూ పీఆర్‌సీ వేతనాలు ఇవ్వాలని, సమ్మెకాలం జీతం ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగులకు, కార్మికులకు డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవ్‌లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలకు సంబంధించిన జీఓలు ఇవ్వాలని, రిటైర్‌మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. కరోనా బదిలీ కార్మికులను ఆప్కాస్‌లోకి తీసుకోవాలని, దహన సంస్కారాల ఖర్చు రూ.20 వేలు ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.7 లక్షలు ఇవ్వాలని కోరారు.
యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నేపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు టి.విజయమ్మ, యు కుమారి, కె.మోహన్‌రావు, ఎం సింహాద్రి, ఎం బాబు, భారతి, జాలమ్మ, కె.ఆనంద్, బి.సుబ్బారావు, అనిత, సునీల్, జి.మధు, ఎస్ రమాదేవి, అంకరాజు తదితరులు పాల్గొన్నారు.