
పొగాకు రైతులకు స్వీయ నియంత్రణ అవసరం
పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్
మద్దిపాడు: పొగాకు రైతులకు స్వీయ నియంత్రణ అవసరమని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్ అన్నారు. మండలంలోని వెల్లంపల్లి వేలం కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా పొగాకు పంట అత్యధికంగా బ్రెజిల్‌తోపాటు జింబాబ్వే, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాల్లో పండిస్తున్నారని అందువలన మన దేశంలో పొగాకు కొనుగోళ్లు తగ్గిపోతున్నాయని తెలిపారు. పైగా అక్కడ పొగాకు సాగు ఖర్చు తక్కువగా ఉండడం, పొగాకు పంటపై నిషేధం లేకపోవడం వలన ఆ దేశాలు అంతర్జాతీయ విపణిలో తక్కువ ధరతో పొగాకు పంటను అమ్ముతున్నాయని, దీంతో మన దేశానికి తీవ్రమైన పోటీ నెలకొందని అన్నారు. భారతదేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో ఒప్పందంలో భాగంగా పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు సంతనాలు చేయడం వలన దేశంలో పొగాకు పరిమితంగా పండించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే గత సంవత్సరం 170 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతులు ఇచ్చామని, కానీ ఈ సంవత్సరం పొగాకు పంట నియంత్రించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్న ఉద్దేశంలో పొగాకు పంటను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరిమితంగా నాణ్యమైన పొగాకు సాగు చేస్తేనే అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు అమ్ముకోగలమని ఆయన రైతులకు హితవు పలికారు. అనంతరం ఆయన్ను రైతులు సన్మానించారు. ముందుగా ఆయన వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఫ్లోర్ నాయకులు అబ్బూరి శేషగిరిరావు, వరహాల చౌదరి, వేలం నిర్వహణాధికారి కోవి రామకృష్ణ, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు ఆంజనేయులు, వెంకయ్య, ఫీల్డ్ ఆఫీసర్ హర్ష, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.