
బహిరంగంగా మద్యం తాగితే చర్యలు
● ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు హెచ్చరిక
ఒంగోలు టౌన్: బహిరంగంగా మద్యం తాగడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై లాఠీ ఝులిపించారు. మద్యం దుకాణాల సమీప ప్రాంతాలు, బస్టాండ్లు, పార్కులు, రోడ్లు, ఇతర ప్రదేశల్ల్లో మద్యం తాగుతూ ప్రజలను అసౌకార్యానికి గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం దుకాణాల పరిసరాలు, ఖాళీ స్థలాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, పాత భవనాల్లో తనిఖీలు నిర్వహించారు. మందుబాబులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని, లేకపోతే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరిచారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే 112కు డయల్ చేయాలని సూచించారు.
ఒంగోలు: చెక్ బౌన్స్ కేసులో నిందితునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ స్థానిక ఎక్సయిజ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎస్.కోమలవల్లి మంగళవారం తీర్పునిచ్చారు. ఒంగోలుకు చెందిన ఎ.అంజలి నుంచి నిందితుడు ఎం.బాబు కుటుంబ అవసరాల నిమిత్తం రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత తన అప్పు చెల్లించమని అంజలి ఒత్తిడి చేయడంతోకొంత మేర బాకీ చెల్లింపు నిమిత్తం రూ.3.50 లక్షలకు అందజేశాడు. ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా బౌన్స్ కావడంతో అంజలి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితుడు బాబుకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. అదే విధంగా ఫిర్యాదికి రూ.6 లక్షలు చెల్లించాలని, జరిమానా కింద ప్రభుత్వానికి రూ.10 వేలు చెల్లించాలని నిందితుడిని జడ్జి ఆదేశించారు.
ఒంగోలు: వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు దొంగతనం చేసిన కేసులో నిందితునికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక ఎక్సయిజ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎ.కోమలవల్లి మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వాహనాలకు సంబంధించి బ్యాటరీల చోరీ కేసులో సయ్యద్‌బాబు అనే వ్యక్తిని చీమకుర్తి పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి నిందితునిపై నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితునికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ కె.శ్రావణ్‌కుమార్ వాదించారు.