
నల్లబర్లీ పొగాకు ఎందుకు కొనడం లేదు?
నాగులుప్పలపాడు: నల్లబర్లీ పొగాకును ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని బర్లీ సాగు చేసిన రైతులు, రైతు సంఘం నాయకులు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గొడవకు దిగి ఆందోళన చేశారు. నల్లబర్లీ సాగు చేసిన రైతులను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని, చివరి పొగాకు వరకు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మధ్యలోనే ఎందుకు ఆపేశారని నిలదీశారు. మండలంలోని ఉప్పుగుండూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం వ్యవసాయాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన రైతులకు పలు సూచనలు చేస్తుండగా ప్రభుత్వ వైఖరిపై రైతులు గళమెత్తారు. రైతుల పట్ల పక్షపాతం చూపిస్తూ రైతులకు అందజేసిన సీరియల్‌లో కాకుండా పలుకుబడి ఉన్న రైతుల వద్ద మాత్రమే నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. దీనికి స్పందించిన జేడీ శ్రీనివాసరావు స్పందిస్తూ ఇప్పటికే రైతుల వద్ద నుంచి కొంత మేరకు నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేశారని, ఇంకా 500 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, త్వరలో నూతన కలెక్టర్‌ను కలిసి మరొకసారి పొగాకు రైతుల సమస్యలను వివరించి మిగిలిన పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అయితే మీరు కొనేలోపు మా దగ్గర ఉన్న పొగాకు నాణ్యత కోల్పోవడం, జాగ్రత్త చేయడానికి తగినంత చోటు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని రైతులు జేడీ దృష్టికి తీసుకొచ్చారు. జీవో నంబరు 740 ప్రకారం జిల్లా లో ఏ ఒక్కరూ నల్లబర్లీ పొగాకు సాగుచేయవద్దని తెల్లబర్లీ పొగాకును కూడా సంబంధిత కంపెనీల వద్ద నుంచి రైతులు అగ్రిమెంట్ తీసుకొని సాగు చేసుకోవాలని జేడీ రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలైన శనగ, మొక్కజొన్న పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు రమేష్ బాబు, వెంకట్రావు పాల్గొన్నారు.
ధ్వజమెత్తిన బర్లీ పొగాకు రైతులు
పొలం పిలస్తోంది కార్యక్రమంలో రైతుల ఆగ్రహం