
నిర్లక్ష్యం నూరుపాళ్లు!
తెరుచుకోని కళ్లు..
చీమకుర్తి: కర్నూలు రోడ్డులో పరిస్థితులు ప్రమాదాలకు దారితీసేలా ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సంతనూతలపాడు సమీపంలోని కర్నూల్ రోడ్డుపై చప్టాకు భారీ గొయ్యి పడింది. పోలీసులు తాత్కాలికంగా బారికేడ్ ఏర్పాటు చేసి ఇసుక సంచులను ఉంచారు. ఈ మార్గంలో వందలాది గ్రానైట్ వాహనాలు, కంకర టిప్పర్లు, శ్లాబుల ట్రాలీలు తిరుగుతుంటాయి. వాటితో పాటు ఇతర లారీలు, కార్లు, బైకులు, ఆర్టీసీ బస్సులు సరేసరి. ఇంత రద్దీగా ఉండే కర్నూలు రోడ్డుపై గొయ్యి ఏర్పడితే ఆర్‌అండ్‌బీ అధికారుల నుంచి మూడు రోజులుగా కనీస స్పందన కరువైంది. ఇదే వంతనపై కొన్నేళ్ల క్రితం ఇలాగే పెద్ద గొయ్యి ఏర్పడింది. అప్పట్లో ఆర్‌అండ్‌బీ అధికారులు నూతన వంతెన నిర్మించాలనే ఉద్దేశంతో రోడ్డుకు దక్షిణం వైపు తాత్కాలికంగా మట్టి రోడ్డు కూడా నిర్మించారు. ఇంతలో ఏమైందో ఏమో వంతెన కింద గొయ్యి పడ్డ ప్రదేశంలో తాత్కాలిక ఏర్పాటు చేసి గొయ్యిపైన తారు రోడ్డు వేసి చేతులు దులుపుకొన్నారు. ఇదిలా ఉండగా ట్రిపుల్ ఐటీ కాలేజీ సమీపంలో కల్వర్టు రెయిలింగ్ విరిగిపడింది. కల్వర్ట్‌పై గుంతను మట్టితో పూడ్చేయడంతో కాలేజీ నుంచి వచ్చే వృథా నీరు రోడ్డుకు ఒక వైపు నిల్వ చేరి మడుగును తలపిస్తోంది. ఇదే ప్రాంతంలో నాలుగైదు రోజుల క్రితం ఒక గ్రానైట్ లారీ రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లింది. తరచూ ఇక్కడ సంభవించే ప్రమాదాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇకనైనా ఆర్‌అండ్‌బీ అధికారులు మొద్దునిద్ర వీడాలని వాహనదారులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
సంతనూతలపాడు–పేర్నమిట్ట మధ్య కర్నూలు రోడ్డుపై ప్రమాదకర పరిస్థితులు
గోతులు ఏర్పడినా, చప్టాలు కూలే స్థితిలో ఉన్నా స్పందించని ఆర్‌అండ్‌బీ అధికారులు