
డెంగీ పంజా!
పెద్దనల్లకాల్వపై
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న అక్కా చెళ్ళెల్లు యస్ ఫేబి, దీప్తి
డెంగ్యూ, మలేరియా బారిన పడిన
రచితకుమార్, సిరి
జ్వరంతో బాధపడుతున్న బొమ్మాజి సంతోష్
కంభం: పల్లెల్లో జ్వరాల తీవ్రతకు కంభం మండలం పెద్దనల్లకాల్వ గ్రామంలోని తాజా పరిస్థితి అద్దం పడుతోంది. గ్రామంలో సుమారు 50 మందికి పైగా చిన్నారులు డెంగీ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారు. వీరంతా పదేళ్లలోపు వారే. గ్రామంలోని ఎస్సీ కాలనీలో అధికంగా జ్వరాలు ఉండగా కొన్ని ఇళ్లలో ఇద్దరు చొప్పున డెంగీ, ఇతర జ్వరాలతో బాధపడుతున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు
జ్వరాలు ఇంతలా విజృంభిస్తున్నా వైద్య శిబిరం ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పిల్లలకు డెంగీ లక్షణాలు ఉండటంతో గిద్దలూరు, కంభం, మార్కాపురం పట్టణాలలోని ప్రైవేట్ వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. కంభం పట్టణంలోని కొందరు ఆర్‌ఎంపీలు స్థానిక ల్యాబ్‌లలో రక్త పరీక్షలు చేయించి, డెంగీ ఉన్నట్లు వారే నిర్ధారించి చికిత్స పేరుతో అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
పాఠశాల సగం ఖాళీ..
గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్లో సగానికి పైగా జ్వరాల బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే కొందరు చికిత్స చేయించుకొని పాఠశాలకు వస్తున్నారు. పాఠశాల ముందు ఉన్న డ్రైనేజీ అధ్వానంగా తయారై, దోమలు విజృంభిస్తుండటంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇటీవల కాలువ శుభ్రం చేసినప్పటికీ అప్పటికే జ్వరాలు ప్రబలిపోయాయి. గ్రామంలో గృహాల మధ్య చిల్లచెట్లు అధికంగా ఉండటం, మురుగు సక్రమంగా పోకపోవడం, పశువులు ఎక్కువగా ఉండటంతో పరిసరాల్లో దోమల ఉధృతి పెరుగుతోంది.
గ్రామంలో 50 మందికిపైగా జ్వర బాధితులు
డెంగీ, టైఫాయిడ్ పీడితులే అధికం
ప్రాథమిక పాఠశాలలో సగానికిపైగా విద్యార్థులకు జ్వరాలే
ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న తల్లిదండ్రులు
గ్రామంలో మెడికల్ క్యాంపులు శూన్యం