
గాలి తీవ్రతకు తెగి పడిన విద్యుత్ తీగలు
● జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం
నాగులుప్పలపాడు: జాతీయ రహదారిపై ఉన్న విద్యుత్ తీగలు తీవ్రమైన గాలులకు తెగిపడిన ఘటన నాగులుప్పలపాడులో మంగళవారం జరిగింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయాల వద్ద 216 జాతీయ రహదారికి ఇరువైపులా ఎత్తుగా వాహనాలు తగలకుండా ఉండేందుకు విద్యుత్ శాఖాధికారులు ఎత్తైన టవర్లతో 11 కేవీ విద్యుత్ తీగలు ఇరువైపులా లాగారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఒక్కసారిగా 216 జాతీయ రహదారిపై పడిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా భయపడిపోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపేశారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే సరఫరా నిలిపేసి తెగిపడిన విద్యుత్ లైన్‌ను సరిచేసి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా ఏర్పాటు చేశారు. గాలి వీచి తీగలు తెగిన సమయంలో రోడ్డుపై ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికై నా జరిగిన నష్టాన్ని గుర్తించి విద్యుత్ తీగల కింద జాలీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.