
కాళ్లతో తన్నుతూ.. బెల్ట్‌తో మోదుతూ పైశాచికం
మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వకపోవడమే కారణం
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ఘటన
ప్రకాశం జిల్లా: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచూ తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. శనివారం రాత్రి కలుజువ్వలపాడు గ్రామానికి వచ్చిన బాలాజీ.. స్థానికంగా ఉండే బేకరీలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న భార్య భాగ్యలక్ష్మిని అటకాయించాడు.
మద్యానికి డబ్బులు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో బాలాజీలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తన అక్క రమణ, మేనల్లుడు విష్ణు, బాలాజీ మరో భార్య కలిసి భాగ్యలక్ష్మిని బైకుపై బలవంతంగా ఎక్కించుకొని.. అక్క ఇంటికి తీసుకువెళ్లి తాళ్లతో నిర్బంధించాడు. రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు చిత్రహింసలకు గురిచేసి విడిచిపెట్టారు. మళ్లీ సోమవారం రాత్రి చిత్రహింసలు పెట్టేందుకు బాలాజీ యత్నించగా ఆమె తప్పించుకొని ఎస్సీ కాలనీలోకి పరుగెత్తింది. స్థానిక చర్చి వద్ద ఉన్న కొందరు యువకులు బాలాజీని, అతని మేనల్లుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
అనంతరం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక యువకులు 112కు ఫోన్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన పోలీసులు బాధిత మహిళను ఫొటో తీసుకుని బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్‌పై ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేసినట్లు సమాచారం. శనివారం చేసిన చిత్రహింసను బాలాజీ రెండో భార్య వీడియో తీయగా అది మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కాగా మహిళను చిత్రహింసలకు గురిచేయడంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై విలేకరులతో తెలిపారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో ప్రచురితం కావడంతో దర్శి సీఐ, తర్లపాడు ఎస్సై కలుజువ్వలపాడు గ్రామానికి చేరుకున్నారు. బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం తర్లుపాడు మండలంలో కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం
భార్యను కట్టేసి బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నిన భర్త#prakasham #tharlupadu #husbandkickswife #andhrapradesh #uanow pic.twitter.com/vqiLth1eOd— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 16, 2025