
ముద్దెనహళ్లిలో జననం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మోక్షగుండం(ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లాలో ఉంది) గ్రామం నుంచి 18వ శతాబ్దంలో విశ్వేశ్వరయ్య పూర్వీకులు కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. అప్పటి మైసూర్ రాజ్యంలోని కోలార్ జిల్లా చిక్‌బళ్లాపూర్ తాలూకా ముద్దెనహళ్లిలో 1861 సెప్టెంబర్ 15వ తేదీన శ్రీనివాసశాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు విశ్వేశశ్వరయ్య జన్మించారు. తండ్రి శ్రీనివాసశాస్త్రి ఆయుర్వేద వైద్యుడు, సంస్కృత పండితుడు. చిక్‌బళ్లాపుర ప్రైమరీ స్కూల్లో విశ్వేశ్వరయ్య ్డప్రాథమిక విద్య పూర్తి చేశారు. 15 ఏళ్ల వయసులో ఉండగా తండ్రి మరణించడం ఆయన్ను బాగా కుంగదీసింది. దానికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కావడంతో చదువును కొనసాగించే పరిస్థితులు కనింపిచలేదు. అయినా సరే పట్టువదలకుండా చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తన మేనమామ హెచ్.రామయ్య సహకారంతో బెంగళూరులోని వెస్లియన్ మిషన్ హైస్కూల్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1880లో బెంగళూరు నగరంలోని సెంట్రల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. ప్రఖ్యాత కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పుణేలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.