
మాటలేనా.. చేతలేవీ?
వెలిగొండ ప్రాజెక్టుపై
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రకటనలు, వాగ్ధానాలకే పరిమితమైనట్లుగా ఉందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జె.జయంత్ బాబు విమర్శించారు. ఆదివారం మార్కాపురం మండల రైతు సంఘం 8వ మహాసభ పెద్దనాగులవరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 వరద సీజన్ నాటికి నీరు విడుదల చేస్తామన్న హామీ అమలు చేస్తారా అని ప్రశ్నించారు. త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, నీటి పారుదల రంగాన్ని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. వెలిగొండ పనులు ప్రారంభించి 30 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తిచేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పండించిన పంటలకు ఏడాది కాలంగా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చినప్పుడే రైతుల ఆత్మహత్యలు నివారించగలమన్నారు. యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
కాగా, మండల రైతు సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా ఓర్సు అడివయ్య, గంగిరెడ్డిని ఎన్నుకున్నట్లు సంఘ నాయకుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. సమావేశంలో రైతు సంఘ నాయకులు సోమయ్య, రూబెన్, బాల నాగయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
మిగులు పనులు చేపట్టకుండా 2026లో నీళ్లెలా ఇస్తారు?
సాగును లాభసాటిగా మారిస్తేనే రైతుల చావులు ఆగుతాయ్
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంత్ బాబు