
22 నుంచి భైరవకోనలో శరన్నవరాత్రి ఉత్సవాలు
సీఎస్‌పురం(పామూరు): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన భైరవకోనలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి, ముప్పాళ్ల శ్యామ్‌సుందర్‌రాజు పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తామని ఈఓ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
త్రిముఖదుర్గాదేవి ప్రత్యేక అలంకారాలు..
దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భైరవకోన త్రిముఖదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు 22వ తేదీ సోమవారం బాలా త్రిపుర సుందరీదేవిగా, 23న శ్రీరాజరాజేశ్వరీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న శ్రీగాయత్రీదేవి, 26న మోహినీదేవి, 27న శ్రీగజలక్ష్మీదేవి, 28న సరస్వతీదేవి, 29న మహిషాసురమర్దిని, 30న శ్రీదుర్గాదేవి, అక్టోబర్ 1వ తేదీన లలితాదేవిగా దర్శనమిస్తారని ఈఓ వివరించారు. 2న విజయదశమి పూజలతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
ఒంగోలు టౌన్: వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి మోపెడ్ మీద వెళ్తున్న ఒక వృద్ధుడిని ఢీకొన్న ఘటన ఆదివారం ఉదయం జరిగింది. నగరంలోని సమతా నగర్‌లో నివశించే రాయని శేషయ్య (54) మోపెడ్ మీద ఒంగోలు నుంచి పేర్నమిట్టకు వెళుతున్నారు. కర్నూలు రోడ్డులో టుబాకో బోర్డు వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేషయ్యను జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు మరో ఇద్దరు సీఐలు బలయ్యారు. ఒంగోలు డీటీసీ సీఐ షేక్ షమీవుల్లాను సస్పెండ్ చేస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. రెండేళ్ల క్రితం పల్నాడు జిల్లా మాచర్ల సీఐగా పనిచేసిన సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు బాపట్ల ఐటీ కోర్‌లో సీఐగా పనిచేస్తున్న జయకుమార్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈయన కారంచేడు సీఐగా పనిచేసి ప్రసుతం బాపట్ల ఐటీ కోర్‌లో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఘటనలను సాకుగా చూపి ఈ ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వీరిని సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరిని లూప్‌లైన్‌లో పెట్టారని, అయినప్పటికీ వదిలిపెట్టకుండా వెంటాడి మరీ చివరికి సస్పెండ్ చేసినట్లు పోలీసు శాఖలో చెవులు కొరుక్కొంటున్నారు.