
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
ఒంగోలు టౌన్: వేగంగా వెళ్తున్న రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని ఓ మహిళ మృతి చెందింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు–కరవది రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని ఒక మహిళ ఆదివారం ఉదయం రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మరణించింది. సుమారు 30 ఏళ్లకుపైగా వయసు కలిగిన ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతురాలు పూల డిజైన్ కలిగిన నిండు పచ్చరంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉంది. రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్సై కె.మధుసూధన రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఆర్పీ ఎస్సై 9440627647ను సంప్రదించాలని కోరారు.
కంభం: జేసీబీ వాహనంలో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన కంభం మండలంలోని యర్రబాలెం సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మార్కాపురానికి చెందిన ఎన్.వెంకటరామిరెడ్డి గిద్దలూరులో పనుల నిమిత్తం జేసీబీని తీసుకెళ్లారు. అక్కడ పనులు ముగిసిన తర్వాత శనివారం అర్ధరాత్రి గిద్దలూరు నుంచి మార్కాపురం వెళ్తుండగా యర్రబాలెం–నల్లకాల్వ మధ్య వాహనంలో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే వాహనం మొత్తం దగ్ధమైందని, సుమారు రూ.14 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు.

రైలు నుంచి జారిపడి మహిళ మృతి