
ఆక్రముంచేశారు!
సాగర్ కాలువ, వాగుల ఆక్రమణలు ఒక్క చీమకుర్తి మండలంలో 20 కి.మీ పొడవునా ఆక్రమణలు 30 నుంచి 40 గ్రామాలకు సాగు, తాగునీటి సరఫరాకు ఆటంకం వెయ్యి ఎకరాలకు పైగా సాగునీటి ప్రవాహాలకు అడ్డుకట్ట భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోని అధికారులు హైకోర్టు కన్నెర్ర చేయడంతో ఇరిగేషన్, మైన్స్ అధికారుల ఉరుకులు పరుగులు 6 వారాల గడువులోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
సాగు, తాగు నీరందించే సాగర్ కాలువ అడుగడుగునా ఆక్రమణలకు గురైంది. చాలా ప్రాంతాల్లో కాలువ కుంచించుకుపోవడంతో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. ఫలితంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నాయి. ఇదంతా తెలిసినా ఇరిగేషన్ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణలపై తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనైనా అధికారుల్లో చలనం వస్తుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కారుమంచి కాలువకట్టపై గ్రానైట్‌రాళ్ళతో వెళ్తున్న ట్రాలీలు(ఫైల్)
చీమకుర్తి:
సాగర్ జలాలు జిల్లాకు ప్రధాన నీటి వనరు. త్రిపురాంతకం వద్ద సాగర్ జలాలు జిల్లాలోకి అడుగిడుతాయి. అక్కడ నుంచి దొనకొండ, కురిచేడు, దర్శి, చీమకుర్తి, సంతనూతలపాడు మీదుగా రామతీర్థం చేరుతాయి. అక్కడ నుంచి ఒంగోలు నగరానికి, కిందన వెయ్యి ఎకరాలకు సాగు నీరు సరఫరా అవుతుంది. ఇంత కీలకంగా ఉన్న కాలువపై అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రధానంగా చీమకుర్తి మండల పరిధిలో ఉన్న పలు గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడ్డారు. సంబంధిత అధికారులకు మామూళ్లు ముట్టజెబుతుండడంతో అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు కన్నెర్ర చేసింది. నాలుగు రోజుల కిందట క్వారీ యజమానులకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాలలోగా సమాధానమివ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ఆక్రమణలు ఇలా..
రామతీర్థం సమీపంలోని నల్లకొండ నుంచి వర్షం నీరు, పైనున్న ఓబీసీ కాలువ నుంచి సాగర్ మేజర్‌లు కర్నూల్‌రోడ్డును దాటుకొని హంస మినరల్స్, జయమినరల్స్, ఎన్‌వీ ఎక్స్‌పోర్ట్‌ల పరిధిలోని దాదాపు 18 ఎకరాల పరిధిలో సాగర్ కాలువలను ఆక్రమించుకోవడం ద్వారా ఆయా కాలువలకు దిగువనున్న బూదవాడ, ఆర్.ఎల్.పురం, మైలవరం, చినరావిపాడు గ్రామాల వైపు సాగరు నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. హైకోర్టులో పిల్ వేయటంతో ఆ మూడు క్వారీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ ఆ మూడు క్వారీలకు దిగువనున్న పలు గ్రానైట్ క్వారీల వారు సాగర్ కాలువలతో పాటు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన సహజ వాగులను ఆక్రమించుకొని డంపింగ్‌లు, గ్రానైట్ క్వారీలు, వేస్ట్ రాళ్లతో ఆక్రమించేయడంతో సాగునీటి ప్రవాహానికి తీవ్రంగా ఆటంకం కలుగుతోంది. బూదవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌లు 106/1,2,3 లలో 10.74 ఎకరాలు, అలాగే సర్వే నంబర్లు 107, 108లో 6.61 ఎకరాలు, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని 66/1, 67/1ఏ, 67/2, 67/2బీ, 69/2, 70/2, 70/3 లలో 0.82 ఎకరాలు మొత్తం కలిపి 18.71 ఎకరాల ప్రభుత్వ భూమిలోని సాగర్ కాలువలు, వాగులను ఆక్రమించుకున్నట్లు హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ఇవే కాకుండా రామతీర్థం పరిధిలోని నల్లకొండ నుంచి వచ్చే వర్షపు నీరు, సాగర్ కాలువలలోని వరద వృథా నీరు అంతా కలిసి ఆర్.ఎల్.పురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌లు 24, 23, 14, 15, 16లలోని రామతీర్థం ఆలయం దేవుడి మాన్యం, పోకర్ణా గ్రానైట్ క్వారీల పరిధిలో నుంచి కర్నూల్ రోడ్డును దాటి బూదవాడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌లు 10, 105, 106, 107, 108, 109 మీదుగా బూదవాడ చెరువు సర్వేనంబర్ 110లోకి వచ్చి చేరుతాయి. ఈ మధ్యలో పోకర్ణా గ్రానైట్ యాజమాన్యం కూడా వాగునీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆక్రమించుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు రోడ్డు దాటిన తర్వాత బూదవాడ చెరువులోకి పోయే ప్రవాహాన్ని జయమినరల్స్, హంస గ్రానైట్ యాజమాన్యం ఆక్రమించుకున్నాయి.
సాగు, తాగునీటి సరఫరాకు ఆటంకం
ఇలా సహజ సిద్ధంగా ప్రవహించే వాగులను, ప్రభుత్వం రైతుల పంటల సాగుకు నీటిని అందించే సాగర్ కాలువలను గ్రానైట్ యజమానులు ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటే ఇరిగేషన్ అధికారులకు ఇవేమీ పట్టనట్లుగా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి కారుమంచి కాలువ ద్వారా సుమారు 30–40 గ్రామాలకు సాగు, తాగునీరు సరఫరా అవుతుంది. కూనంనేనివారిపాలెం, గోనుగుంట, మువ్వవారిపాలెం, ఎనికపాడు, మద్దులూరు ద్వారా చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లోని పలు గ్రామాలకు కారుమంచి కాలువ ద్వారా 119 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దానిని మధుకాన్ గ్రానైట్ యాజమాన్యం బఫర్ జోన్ నిబంధనలకు తిలోదకాలిచ్చి కారుమంచి కాలువ ఒడ్డు సమీపం వరకు తవ్వుకోవడం వలన కాలువ ఒడ్డు విరిగి మధుకాన్ క్వారీలో పడింది. దాని ఫలితంగా దిగువనున్న 30కు పైగా గ్రామాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల ప్రజలు, పశువుల తాగునీటి అవసరాలకు ఉపయోగించే చెరువులకు కారుమంచి నుంచి సక్రమంగా నీటిని అందించటంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రానైట్ రాళ్లతో ఇష్టం వచ్చినట్లు పెద్దపెద్ద ట్రాలీలు కారుమంచి కాలువ కట్ట మీద తిరుగుతున్నా మామూళ్లు మత్తులో జోగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చీమకుర్తి ఇరిగేషన్ డివిజన్, సబ్‌డివిజన్‌కు సంబంధించిన అధికారులందరూ చీమకుర్తిలోనే ఉంటున్నా వారికేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. హైకోర్టు ఆగ్రహించడంతో ఇరిగేషన్, మైన్స్ అధికారులు ఎలా స్పందిస్తారోనని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆక్రముంచేశారు!

ఆక్రముంచేశారు!