
జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
ఒంగోలు టౌన్: జిల్లా ఎస్పీగా వి.హర్షవర్థన్ రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన విజయవాడ డీసీపీగా, సీఐడీ ఎస్పీగా పనిచేశారు. అన్నమయ్య జిల్లా తొలి ఎస్పీగా చేశారు. నెల్లూరు జిల్లా కావలి గ్రామానికి చెందిన హర్షవర్థన్ జేఎన్‌టీయూసీలో బీటెక్ చేశారు. ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఏఆర్ దామోదర్‌ను విజయనగరం బదిలీ చేశారు.
ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతిలో చేరేందుకు అడ్మిషన్లకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారని ప్రిన్సిపల్ సి.శివరాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు జవహర్ నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే పూర్తి వివరాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ ఆఫీస్‌లో సంప్రదించాలని, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23 వరకు గడువు పెంచారని తెలిపారు. వివరాలకు 77802 08733 నంబరును సంప్రదించాలని కోరారు.
ఒంగోలు: జిల్లావ్యాప్తంగా 25 బెంచీలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో శనివారం 6729 కుపైగా కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు. 167 సివిల్, 6558 క్రిమినల్ వ్యాజ్యాలతోపాటు ప్రీలిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కరించారన్నారు. మోటారు వాహన ప్రమాద బీమా కేసుల్లో, కొన్ని ఇతర రకాల కేసుల్లో దాదాపుగా రూ.2 కోట్లు పరిష్కారం రూపంలో చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సహకరించిన న్యాయవాదులకు, పోలీసువారికి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులకు, బ్యాంకు అధికారులకు, బీమా అధికారులకు న్యాయసేవాధికార సంస్థ తరఫున జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి అభినందనలు తెలిపారు.
ఒంగోలు సిటీ: 12వ వేతన సంఘాన్ని నియమించి, 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం ఒంగోలు వీఐపీ రోడ్డులోని ప్రధానోపాధ్యాయుల భవనంలో బీటీఏ ఒంగోలు జిల్లా కార్యవర్గ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కె.దేవసహాయం అధ్యక్షతన, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకటరావు మాట్లాడుతూ 11వ పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మాధవరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల మీద యాప్ ల భారం ఎక్కువైందని, దాని వలన బోధన కుంటుపడిందని, ప్రభుత్వం వెంటనే యాప్ ల భారం తగ్గించి బోధనపై దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జాలరామయ్య, రాష్ట్ర కార్యదర్శి యం.శరత్ చంద్ర బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్నాథం ప్రసాదరావు, జిల్లా కోశాధికారి గంటనపల్లి శ్రీనివాసులు, జిల్లా ప్రచార కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, జిల్లా నాయకులు గాలిమోటు భాస్కరరావు, బొంత కళ్యాణ్, నూకతోటి కుమార్ స్వామి, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు

జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు