
నల్లమలలో గుండ్లకమ్మ ఉధృతం
రాచర్ల: గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా గుండ్లకమ్మ పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శనివారం నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు నిరాశ ఎదురైంది. భారీ వర్షాలతో గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలతో పాటు దేవస్థానం సమీపంలోని నీటి గుండం వద్ద భక్తులు స్నానాలు చేయకుండా దేవస్థానం సిబ్బంది, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
కొండ చెరియలు విరిగిపడటంతో దర్శనం నిలిపివేత:
ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్ష్మమ్మవనం నుంచి నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం వెళ్లే మార్గంలో శనివారం మధ్యాహ్నం 11:50 గంటల సమయంలో కొండ చెరియలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామి దర్శనం పూర్తిగా నిలిపేసినట్లుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య తెలిపారు.

నల్లమలలో గుండ్లకమ్మ ఉధృతం