
ఆస్ట్రేలియా శనగలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: శనగల దిగుమతులపై ఉన్న 30 శాతం సుంకాన్ని మోదీ ప్రభుత్వం ఎత్తివేయడంతో దేశంలోకి లక్ష టన్నుల శనగలు దిగుమతి అయ్యాయని, దాంతో దేశ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి చెప్పారు. స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ ఇచ్చిన మాటకు ఆయనే తూట్లు పొడిచారన్నారు. ఫలితంగా నిన్నటి దాకా క్వింటా శనగలు రూ.10 వేలకు కొనుగోలు చేశారని, ఇప్పుడు కేవలం రూ.6 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో శనివారం రైతు సంఘాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన దేశ రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేలా దిగుమతి సుంకాలు ఎత్తివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించలేని దుస్థితిలో ఉందన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా శనగలు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతులను ఆదుకుంటామని పత్రికా ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో అలాంటిదేమీ లేదన్నారు. రైతుల వద్ద ఉన్న పంటలను కొనుగోలు చేసేంత వరకు రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం శనగ పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శనగ పండించే గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించిన మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలకు వినతి పత్రాలను అందజేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశానికి రైతు నాయకులు వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించగా దేవరపల్లి సుబ్బారెడ్డి, బి.సుబ్బారావు, మహేష్, టీవీ శేషయ్య, సీహెచ్ వాసు, ఆంజనేయులు, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.