
20, 21న అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర మహాసభలు
ఒంగోలు టౌన్: ఈ నెల 20, 21 తేదీల్లో ఒంగోలులో నగరంలోని కాపుకళ్యాణ మండపంలో నిర్వహించే అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర 11వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్‌వాడీలు, హెల్పర్లకు ఉద్యోగ భద్రతలేకుండా పోయిందని చెప్పారు. సుప్రీం కోర్టు సైతం అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించినట్లు గుర్తు చేశారు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నా అంగన్‌వాడీలకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి నిధులు పెంచకుండా, ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి వేతనాలు పెంచలేదని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పాలకులు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంగన్‌వాడీల అభివృద్ధికి తగినంతగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈదర అన్నపూర్ణ, ఎం.రమేష్, ఎన్.ధనలక్ష్మి, బి.శేషమ్మ, సుబ్బమ్మ, కె.మున్నా తదితరులు పాల్గొన్నారు.