
3 వేల పెన్షన్లు కావాలనే కక్షపూరితంగా తీసేశారు: దర్శి ఎ
3 వేల పెన్షన్లు కావాలనే కక్షపూరితంగా తీసేశారని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు కొత్త రీవెరిఫికేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, సదరన్ క్యాంపులు మండలాల వారీగా, జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా పెడతారా అని డీఎంఅండ్‌హెచ్‌ఓను ప్రశ్నించారు. నియోజకవర్గాల వారీగా సదరమ్ క్యాంపులు పెట్టేటప్పుడు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులు పదిహేను రోజుల ముందుగా నోటీసుబోర్డులో పెడితే తమ పరిధిలోని పింఛన్లు ఇప్పించుకోవడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త వితంతువు పింఛను కూడా ఇవ్వలేదని అధికారులే చెబుతున్నారన్నారు. మలేరియా, డెంగీ జ్వరాల బారిన పడినవారి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో అధికారులు తెలియజేయాలన్నారు. విద్యుత్ పోల్స్ వచ్చినప్పుడు కండెక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కండెక్టర్లను ఎవరు అమ్ముకున్నారో చెప్పాలని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వాడితే ఫ్రీ ఉందా లేదా అని ప్రశ్నించారు. మోటుపల్లి ఒక చిన్న గుడిసెలో ఉంటున్న పేదవారిని విద్యుత్ బకాయి రూ.7 వేలు ఉంది కట్టాలంటూ ఇబ్బంది పెడుతున్నారని, దీనిని పరిశీలించాలని విద్యుత్ అధికారులను కోరారు. రైతులకు కావాల్సినంత డీఏపీ, యూరియా సరఫరా చేయాలని కోరారు. బ్లాక్ మార్కెట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.