
ర్యాంకులు!
గ్రేడ్–3 ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
ఇప్పటికే పలు మార్లు విచారణ వాయిదా
మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య ఫిర్యాదు
అక్రమాలపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జేడీ విచారణ
శుక్రవారం కొనసాగనున్న విచారణ
జీజీహెచ్‌లో నర్సింగ్ డ్యూటీల విషయంలో చేతివాటం
వైద్యారోగ్య శాఖలో పెచ్చుమీరిపోతున్న అవినీతి
అవినీతి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవినీతి జబ్బు చేసింది. పైసా లేనిదే ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఏఎన్‌ఎం పదోన్నతుల విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడం తెలిసిందే. జిల్లా సెలక్షన్ కమిటీ పరీక్షల్లో వచ్చిన ర్యాంకులను రాత్రికి రాత్రే మార్చేసి పదోన్నతులు చేసినట్లు కొందరు ఏఎన్‌ఎంలు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బందికి సెలవు కావాలన్నా సరే బల్లకింద చేతులు తడపకుండా పనికావట్లేదన్న ఆరోపణలు రావడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లా వైద్యారోగ్య శాఖలో 826 మంది గ్రేడ్–3 ఏఎన్‌ఎంలు ఉన్నారు. వారిలో 215 మందికి గ్రేడ్–2 ఏఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పించారు. 2024 ఫిబ్రవరిలో సినియార్టీ లిస్ట్ ప్రకటించారు. తెరవెనుక ఏం జరిగిందో కానీ అదే ఏడాది ఆగస్టులో సీనియారిటీ లిస్టులో మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా సెలక్షన్ కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండానే సీనియారిటీ లిస్టు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత ఏడాది దాటాక 2025 మార్చి 17వ తేదీన జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే జిల్లా సెలక్షన్ కమిటీ ఇచ్చిన ర్యాంకుల ప్రకారం పదోన్నతులు చేపట్టాల్సిన అధికారులు దానికి భిన్నంగా ర్యాంకుల్లో మార్పులు, చేర్పులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ర్యాంకులు మారడంతో ఏడుగురు ఏఎన్‌ఎంలు పదోన్నతులు కోల్పోయారు. ఇందులో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే అధికారులు వారి దృషికి తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
ఆ నలుగురు ఎవరు...
ఇదిలా ఉండగా పదోన్నతుల వ్యవహారంలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోని ఓ నలుగురు పదోన్నతుల అక్రమాలకు తెరదీసినట్లు ప్రచారం జరిగింది. లిస్టులో ర్యాంకుల మాయ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే 250 ర్యాంకు వచ్చిన వారికి సీనియారిటీ లిస్టులో 142వ ర్యాంకు, 288వ ర్యాంకు వచ్చిన వారికి సీనియారిటీ లిస్టులో 162వ ర్యాంకు ఇచ్చారు. గతంలో మండ్లమూరు మండలంలోని పులిపాడు సచివాలయంలో విధులు నిర్వహించిన గ్రేడ్–3 ఏఎన్‌ఎంకు డీఎస్సీ ర్యాంకుల్లో 206వ ర్యాంకు కేటాయించారు. పదోన్నతుల దగ్గరకు వచ్చే సరికి ర్యాంకు 213కు చేరుకుంది. ఇదేలా సాధ్యమో అర్థం కాక ఆమె తలపట్టుకున్నారు. ఒకసారి ర్యాంకు ఇచ్చిన తరువాత మధ్యలో ర్యాంకు మారడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా 3517 ర్యాంకు వచ్చిన ఏఎన్‌ఎంకు సీనియారిటీ లిస్టులో 845వ ర్యాంకు రావడంతో పలువురు ఏఎన్‌ఎంలు విస్మయానికి గురయ్యారు. నష్టపోయామని భావించిన ఏఎన్‌ఎంలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
వాయిదాల మీద వాయిదా...
బాధిత ఏఎన్‌ఎంలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. అప్పటి డీసీఎం మాధురిని విచారణాధికారిగా నియమించారు. అయితే ఇక్కడ కూడా ఏదో జరిగిందన్న పుకార్లు షికార్లు చేశాయి. ఎందుకోకానీ డీసీఎం మాధురి విచారణ సక్రమంగా జరగలేదు. ఒకసారి మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత విచారణ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. డీసీఎం మాధురి మీద ఒత్తిడి వచ్చిందని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు గుసగుసలాడుకున్నారు. ఈ లోపు మాలమహానాడు అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. తర్వాత జాయింట్ డైరక్టర్ సునీల్ నాయక్‌ను విచారణాధికారిగా నియమించారు. గురువారం జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో సునీల్ నాయక్ విచారణ చేపట్టారు. ర్యాంకింగ్ మార్పుతో పదోన్నతులు కోల్పోయిన ఏఎన్‌ఎంలు, ఫిర్యాదుదారులు విచారణాధికారిని కలిసి వాదన వినిపించారు. శుక్రవారం కూడా అయన విచారణ జరపనున్నట్లు సమాచారం.
జేడీ విచారణలోనైనా అక్రమాలు బయటపడతాయా లేదా అని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అసలు ఉద్యోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఆ నలుగురు ఎవరు, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా నర్సుల డ్యూటీల విషయంలోనూ చేతివాటం చూపిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది.
ఫోన్ పే ద్వారా డబ్బు వసూలు...
పదోన్నతులు, కోరిన చోటికి బదిలీలు చేయడానికి ఆ నలుగురు పైసా వసూళ్లకు తెగబడ్డారని ఆరోపణలు వచ్చాయి. నేరుగా డబ్బులు వసూలు చేస్తే ఏమవుతుందోనని కొత్త తరహాలో లంచాల వసూళ్లకు తెరదీసినట్లు ప్రచారం జరిగింది. తన కుటుంబ సభ్యులు, మిత్రుల ఫోన్ల నంబర్లు ఇచ్చి వారి పేరు మీద ఫోన్ పే చేయించుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని మరో గ్రూపు సమాచారాన్ని లీక్ చేయడంతో అక్రమాల గుట్టు రట్టయింది. ఏఎన్‌ఎంలు కూడా తమ వద్ద ఫోన్ పే చేయించుకున్నారని చెప్పడంతో వైద్య శాఖలో సంచలనం సృష్టించింది. దీంతో కథ కలెక్టర్ వద్దకు చేరింది.

ర్యాంకులు!